రైతులకు బండి సంజయ్ భరోసా.. ఇలా చేయండని సూచన..

by Shyam |
bandi-sanjay-12
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది నుంచి యాసంగి సీజన్‌లో వరిని మాత్రమే పండించాలని రైతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో యాసంగిలో వరిని సాగు చేయవద్దంటూ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన నిమిషాల వ్యవధిలో బండి సంజయ్ పై పిలుపును ఇవ్వడం గమనార్హం. యాసంగి సీజన్‌లో రైతులు పండించే వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనే ప్రసక్తే లేదని మంత్రి వ్యాఖ్యానిస్తే ప్రభుత్వాన్ని మెడలు వంచి కొనిపించేలా చేస్తామని బండి సంజయ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేత కొనిపించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. యాసంగి వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి ముందుకు రాకపోతే దానితో ఎలా కొనిపించాలో బీజేపీకి బాగా తెలుసన్నారు. ప్రభుత్వంపై ఏ రకంగా ఒత్తిడి చేయాలో కూడా తెలుసని, మెడలు వంచి మరీ కొనిపిస్తామని, రైతులు గాభరా పడాల్సిన అవసరం లేదని నొక్కిచెప్పారు. యాసంగిలో వరిని పండించవద్దంటూ రాష్ట్ర వ్యవసాయ మంత్రే రైతులకు పిలుపునివ్వడం సిగ్గుచేటని సంజయ్ వ్యాఖ్యానించారు. పైగా కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ యాసంగిలో వరిని కొనబోమంటూ లేఖలు కూడా రాశాయంటూ నెపాన్ని వాటిమీదకు నెట్టడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో బీజేపీ చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed