- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TRS నాయకులకు బంపర్ ఆఫర్.. అమ్మకానికి కేసీఆర్ గుడి, విగ్రహం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కేసీఆర్ గుడి అమ్మబడును.. ఇదేంటీ కొత్తగా అనిపిస్తోందా.. గుడినే కాదు.. కేసీఆర్ విగ్రహం కూడా విక్రయిస్తాడటా.. నిజమే మీరు చదువుతోంది.. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తన ఇంటి ముందు నిర్మించిన కేసీఆర్ గుడి, విగ్రహాన్ని విక్రయించేందుకు నిర్ణయించారు. తనకు అన్యాయం జరిగినా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో.. కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ గుడి, విగ్రహాన్ని విక్రయిస్తానని ఆదివారం ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడంతో అంతా వైరల్ అవుతోంది.
గుండ రవీందర్ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండగా.. కేసీఆర్ అంటే గుండెల్లోనే కాదు.. ఏకంగా ఇంటి ముందు గుడి కట్టి విగ్రహానికి నిత్యం పూజలు చేసిన వీరాభిమాని. స్వరాష్ట్రం కోసం తపించి ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేయగా.. 30కిపైగా బైండోవర్ కేసుల్లో పోలీసు స్టేషన్ల చుట్టు తిరిగారు. సుమారు రూ.3లక్షల సొంత డబ్బుతో కేసీఆర్‌తో పాటు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలు నిర్మించారు. పార్టీ కోసం, అధినేత కోసం ఇంత చేసిన ఆయనకు పార్టీలో కనీస గుర్తింపు, ప్రాధాన్యత లేకుండా పోయింది. తన జీవనాధారమైన కేబుల్ నెట్వర్కును 2018లో వేరే వారు లాగేసుకుంటే.. కాళ్లరిగేలా తిరిగినా కనీసం పట్టించుకున్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు.
స్థానిక పోలీసులు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు మొర పెట్టుకున్నా.. సీఎం కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టు తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది. చాలా సార్లు తెలంగాణ తల్లి విగ్రహం ముందు, కేసీఆర్‌కు తాను కట్టిన గుడి ముందు ధర్నా దీక్ష చేశారు. ఓ సారి ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపినా.. తన సమస్య పరిష్కారం కాలేదు. పార్టీ వారికి విషయం తెలిసి.. అప్పటి ఎంపీ, ప్రస్తుత విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అప్పగించినా పరిష్కారం కాలేదు. దీంతో జనవరి 12న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన ఇంటి ముందు ఉన్న గుడిలోని కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి.. అప్పటి నుంచి నిత్యం పూజలు చేయటం ఆపేశారు.
అయిదారు నెలల క్రితం బీజేపీలో చేరిన ఆయన.. తాజాగా ఇంటి ముందు ఉన్న కేసీఆర్ గుడి, విగ్రహాన్ని అమ్మకానికి పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టును ఫేస్ బుక్‌లో పెట్టారు. తాను అభిమానించిన నాయకుడు, పార్టీ.. ఆపద సమయంలో పట్టించుకోలేదని.. ఇప్పుడు బీజేపీలో చేరాక ఇంటి ముందు కేసీఆర్ గుడి, విగ్రహం ఎందుకనే ఉద్దేశ్యంతోనే విక్రయానికి పెట్టినట్లు గుండ రవీందర్ ‘దిశ ప్రతినిధి’తో పేర్కొన్నారు. అమ్మకం నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కొందరు.. మంచి పని చేస్తున్నావని మరికొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారన్నారు. కొందరు కొనేందుకు ముందుకు వస్తున్నారని.. ఎవరూ రాకుంటే కూల్చి వేస్తానని చెబుతున్నారు. ఎవరో ఒకరు ఫోన్ చేసి కేటీఆర్ ఆఫీసు నుంచి ఫోను చేస్తున్నామని చెప్పి.. అన్ని వివరాలు, ఫొటోలు ఆదివారం ఉదయమే తీసుకున్నారన్నారు. తర్వాత ఎలాంటి సమాచారం, స్పందన లేదన్నారు.