- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రోకర్లే ఆఫీసర్లు..! అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆఫీసంతా వారిదే.. అధికారి కంటే ఎక్కువగా హల్ చల్ చేస్తారు. ఇంపార్టెంట్ ఫైళ్ల రూంలోకి వెళ్తారు. ఆఫీసర్ తో కూర్చొని పనులు చక్కబెడుతారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో దళారుల తీరు ఇది. రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో వీరి చేతుల్లోకి దస్తావేజు పోకుండా పని కావాలంటే కష్టమే. ఎవరైనా కాదని పని చేసుకోవాలని ముందుకెళ్తే ఆఫీసులోనే చుక్కలు చూపించేస్తారు. పలువురు అధికారులు సైతం వీరికే వత్తాసు పాడుతున్నారు.
సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయాలు దళారులకు అడ్డాగా మారుతున్నాయి. వారు ఇన్వాల్ కాకుంటే రిజిస్ర్టేషన్ కానేకాదు. ప్లాటు.. వ్యవసాయ భూమి.. పెళ్లి ఇలా ఏదైనా రిజిస్ర్టేషన్ కావాలంటే దస్తావేజుకు బ్రోకర్ల చేయి తాకాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేరుగా రిజిస్ర్టేషన్ కార్యాలయానికి ఎవరైనా వెళ్తే సవాలక్ష నిబంధనలతో యజమానులను వెనక్కి పంపుతున్న పరిస్థితి ఎదురవుతోంది. ప్లాటుకు ఓ రేటు.. ఎకరానికి మరో రేటుగా ఫిక్స్ చేస్తూ సబ్‌రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో దళారులు దందా సాగిస్తున్నారు. సబ్‌రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది అండదండలతోనే బ్రోకర్లు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నరనే విమర్శలు వస్తున్నాయి.
డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులు
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఉద్యోగులను తమవైపు తిప్పుకొని యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన రిజిస్ట్రేషన్ పత్రం నకిలీదా, సరైనదా అని పరిశీలించకుండా, తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించకుండానే కొందరు ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
పొలం, స్థలం, భవనం ఇలా దేనినైనా రిజిస్ట్రేషన్ చేసే ముందు కొనే వ్యక్తి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ స్థలం అవతలి వ్యక్తిదేనా అన్నది విచారించాలి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అలా జరగడం లేదు. ఒక్కో పొలం, స్థలం, భవనం నాలుగైదు సార్లు హక్కుదారులకు తెలియకుండానే చేతులు మారుతున్నా సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ల పరంపర సాగిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో రూ.లక్షలు చేతులు మారుతున్నాయని సమాచారం. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో 2002లో అప్పటి వరకు ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సు రెన్యూవల్‌ను నిలిపివేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ అమల్లో భాగంగా సైతం డాక్యుమెంట్ రైటర్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కానీ పోర్టల్ లో లోపాల కారణంగా తిరిగి డాక్యుమెంట్ రైటర్లు తెరపైకి వచ్చారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూరా యథేచ్ఛగా డాక్యుమెంట్ రైటర్ల అడ్డాలు వెలిశాయి. కార్యాలయాల్లో వీరు చెప్పినట్లే అంతా నడుస్తుండడం గమనార్హం.
డాక్యుమెంట్ రైటర్లుగా రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లు
రిజిస్ర్టేషన్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం గతంలో పబ్లిక్ డేటా ఎంట్రీని అమల్లోకి తీసుకొచ్చింది. శాశ్వతమైన దస్తావేజులను స్వయంగా తయారు చేసుకునే వెసలుబాటు లభించింది. ఈ విధానంలో ఇంట్లోనే దస్తావేజు తయారు చేసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు హాజరైతే సరిపోతుంది. కానీ దస్తావేజుదారులు తమ పని పోగొట్టుకోలేక సబ్ రిజిస్ట్రార్లతో ములాఖత్ అయి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వారిని తమ వద్దకు పంపించేలా రాయబారాలు నడుపుతున్నారు.
దీంతో పబ్లిక్ డేటా ఎంట్రీ పక్కదారి పట్టి భూక్రయ విక్రయదారులు తిరిగి డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట, చుట్టుపక్కల 40 నుంచి 60వరకు డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే, రిటైర్డ్ అయిన సబ్ రిజిస్ట్రార్లు పలువురు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తారంటే ఇందులో ‘లాభం’ ఎంత ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
అసలెవరు..నకిలీలెవరు..?
గ్రేటర్ లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడుగుపెడితే అక్కడ ప్రైవేట్ వ్యక్తులెవరో, శాఖ ఉద్యోగులెవరో ఎంతటి ఘనులైనా గుర్తించలేరు. కార్యాలయాల్లో హడావుడిగా తిరుగుతూ చకచకా పనులు చేస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలపై సబ్‌రిజిష్ట్రాలతో సంతకాలు పెట్టిస్తూ… ‘ఆజ్ నై.. కల్ ఆవో’ అంటూ ప్రజలపై పెత్తనం చేస్తూ.. పని కాగానే ‘పద్ధతి’ని పాటించాలంటూ బహిరంగంగానే అమ్యామ్యాలు డిమాండ్ చేస్తుంటారు.
విలువైన రికార్డుల గదుల్లోనూ అంతా తామై పనులు చక్కపెట్టే వీరి వ్యవహార తీరు అచ్చం శాఖ ఉద్యోగులను తలపిస్తుంది. అధికారులతో వీరు వ్యవహరించే పద్ధతిని పరిశీలిస్తే కూడా ఇదే అనిపిస్తుంది. కానీ ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులే ఇందులో ఉంటారు. అధికారుల అండదండలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులు ఆడింది ఆటగా సాగుతోంది. ఈ క్రమంలోనే బోయిన్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పనులను చక్కబెడుతున్నారు. సదరు వ్యక్తులు కార్యాలయంలోనే ఉంటూ అడ్డదారుల్లో దళారులకు పనులను చేసి పెడుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులు లేరు
మా కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల చేత పనులు చేయించడంలేదు. ఆ విషయం నా దృష్టికి రాలేదు. ఎవ్వరైనా డాక్యుమెంట్ రైటర్లు వారిచేత పనులు చేయించుకొని ఉండోచ్చు. కానీ మేము మాత్రం మా కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించడంలేదు. -రేణుక, సబ్ రిజిస్ట్రార్, బోయిన్ పల్లి