ఆ శాఖలో రూ. లక్షలిచ్చినా పని జరగడం లేదు..!

by Anukaran |
ఆ శాఖలో రూ. లక్షలిచ్చినా పని జరగడం లేదు..!
X

దిశ, సిద్దిపేట: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కోసం యాజమాన్యం, ప్రభుత్వం అనుమతిచ్చింది. 2021-22 సంవత్సరానికి పరస్పర బదిలీలకు షెడ్యూల్ సైతం జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖలో పరస్పర బదిలీలు, సాధారణ బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బదిలీల ప్రక్రియ బాగానే ఉన్నా ఉద్యోగులు ఇష్టం ఉన్నచోట పనిచేయాలంటే అధికారులకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షల్లో చెల్లించినా అనుకున్న చోట బదిలీ స్థానం వస్తుందని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా అధికార పార్టీ యూనియన్ నాయకులను సైతం అడిగిన చోట బదిలీ చేయడం లేదంటే మిగతా యూనియన్ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యుత్ శాఖలో పరస్పర బదిలీలు షురూ..

సొంత జిల్లాలోకి వెళ్లి పనిచేసేందుకు ఆయా డివిజన్ల వారీగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అటెండర్ ఉద్యోగం నుంచి సబ్‌ఇంజినీర్, లైన్ మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ వరకు సుమారు 200 మంది ఉద్యోగులు పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

డబ్బులు , ఫైరవీలకు ప్రాధాన్యత…

విద్యుత్ ఉద్యోగుల పరస్పర బదిలీలు ఉన్నతాధికారులకు పెద్ద వరంగా మారింది. కింది స్థాయి ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా వారి వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. అటెండర్ ఉద్యోగం నుంచి సబ్ ఇంజనీర్ వరకు బదిలీ కావాలంటే రూ. లక్షల్లో లంచం ఇవ్వాల్సిందే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు చివరి క్షణంలో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే.. అనుకున్న స్థానం బదిలీ ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డిమాండ్ ఉన్న ప్రాంతానికి బదిలీ చేయాలంటే లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నట్లు పలువురు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని వారికి పరస్పర బదిలీలు అవకాశం దక్కలేదని అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ యూనియన్ లీడర్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా బదిలీలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

డబ్బులిచ్చినా నమ్మకం తక్కువ..

నచ్చిన చోటుకి ఉద్యోగాన్ని బదిలీ చేయించుకునేందుకు లక్షలు అప్ప జెప్పినా.. అనుకున్న స్థానం దొరకడం లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. డబ్బులిచ్చిన 15 నుంచి 20 మందికి ఉన్న స్థానంలోనే బదిలీ చేశారని ఆరోపించారు. ముఖ్యంగా లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్ మెన్ విభాగంలో 20 మంది ఉద్యోగుల్లో పది మందిని మాత్రమే బదిలీ చేసి మిగిలిన పది మందికి యథావిధిగా అదే స్థానంలో ఉంచారు. అలాగే జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌ పోస్ట్‌లలో 12 మంది ఉంటే ఆరుగురిని మాత్రమే బదిలీ చేసి మిగిలిన ఆరుగురిని యథావిధిగా అదే స్థానంలో కొనసాగించారు. దీంతో జరిగిన బదిలీలు అన్ని కూడా అక్రమ బదిలీలే అని.. వాటిపై పునరాలోచన చేయాలని పలువురు యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed