హయత్​నగర్ పీఎస్‌లో సూపర్ పోలీసులు?

by Anukaran |
హయత్​నగర్ పీఎస్‌లో సూపర్ పోలీసులు?
X

దిశ, ఎల్బీనగర్: భూ కబ్జా కేసులు నగరంలోని ఓ ఠాణాకు కాసుల వర్షం కురిపిస్తున్నది. కబ్జా కేసు వచ్చిందంటే చాలూ వారే ముందుండి పరిష్కరిస్తున్నారు. చేతులు తడిపే నాయకుడికే అండగా నిలిచి అభాగ్యులకు చుక్కలు చూపిస్తారు. అంతేకాదు సరికొత్త విధానంలో మామూళ్ల వసూళ్లు సాగుతున్నాయి. భూ తగవుల కేసులనే ఎక్కువగా అక్కడ సెటిల్​చేస్తుంటారు. ఇక, చిన్నచితక కేసులతో వస్తే ఇక్కడ పట్టించుకునే సారే ఉండరు. అవినీతికి అడ్డాగా మారుతున్న హయత్​నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారుల తీరుపై ప్రత్యేక కథనం.

హైదరాబాద్ పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భూకబ్జా కేసులు పెరిగిపోతున్నాయి. జీపీఏ హోల్డర్లు, లే ఔటు మార్పు చేర్పులను అసరాగా చేసుకున్న భూకబ్జాదారులు, రియల్ వ్యాపారులు నకిలీ పత్రాలను సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు. దీంతో సదరు భూ యజమాని న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా పోలీసులు కేసు నమోదు చేసుకుని కబ్జాదారులకు ఫోన్ చేసి మరీ రిటన్ కేసు వేయమని చెబుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఇరువర్గాల నుంచి కేసు నమోదైందంటూ సెటిల్​మెంట్​చేస్తామని పిలిచి వసూళ్ల పర్వం మొదలు పెడుతారు.
చేతులు తడపనిదే..

పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసుకుంటే ఇరువర్గాలకు సెటిల్​మెంట్ చేసి ఎంతో కొంత ముట్ట చెబితేగాని ఆ కేసు కొలిక్కిరానివ్వరు. కేసులు పెట్టిన వారే తాము కాంప్రమైజ్ చేసుకుంటాం సార్.. అన్నా వదలని పరిస్థితి హయత్​నగర్​ ఠాణాలో నెలకొందని పలువురు బాధితులు చెబుతున్నారు. సెటిల్​మెంట్లు తప్పా మరే ఇతర కేసులు వచ్చినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు హయత్​నగర్​ పోలీసు అధికారులు.
ఫోన్ ఎత్తేవారే లేరు..

కరోనా నేపథ్యంలో ఇక్కడి పోలీసులు ప్రజలను దగ్గరకు రానివ్వడం లేదు. న్యాయం చేయమని ఫోన్ ద్వారా అయినా కోరుదామంటే ఫోన్ లిఫ్ట్ చేసే వారే లేకుండా పోయారు. ఓ వైపు రాష్ట్ర హోంశాఖ మాత్రం ఫిర్యాదుదారులు న్యాయం కోసం ఫోన్ కాల్, మెసేజ్, వాట్సాప్ ఇలా.. పోలీసులకు ఏవిధంగా అయినా ఫిర్యాదు చేయవచ్చని చెబుతుండగా, ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు హయత్​నగర్ రక్షకభటులు.

వాటెన్​ఐడియా..

హయత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకంగా ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారు. సెటిల్​మెంట్ తో వచ్చే డబ్బును నేరుగా తీసుకోకుండా స్టేషన్ బయట ఉన్న ఏదో ఒక బండి నెంబర్ చెప్పి అందులో పెట్టి వెళ్లమని చెబుతున్నారు. వారు వెళ్లిపోయాక.. సదరు అధికారి సిబ్బందితో కవరు తెప్పించుకొని కొద్ది మొత్తం కిందిస్థాయి ఉద్యోగులకు అందజేసి మిగతాది జేబులో వేసుకుంటున్నాడు. ఇదంతా గమనించిన స్థానికుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. పోలీసు అధికారులే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండడంతో తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

కొన్ని ఘటనలు

ఈ మధ్య కాలంలో పెద్ద అంబర్​పేటలోని ఒక ప్లాట్​కు డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులను ప్రధాన నిందితుడి స్థానం నుంచి ఎఫ్ఐఆర్​చివరి స్థానానికి నమోదు చేసినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నగర శివారులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు. దీంతో ఓ పెద్ద మనిషి వారి తగవును తీర్చి లాకప్​లో ఉన్న సదరు వ్యక్తులను విడుదల చేయాల్సిందిగా అధికారులను కోరారు. అయితే తమ చేతికి అమ్యామ్యాలు అందలేదనే దురుద్దేశంతో వారిని అర్ధరాత్రి వరకూ విడిచి పెట్టలేదు.

ఇటీవల ఓ ఆస్పత్రిలో జరిగిన గొడవకు అకారణంగా అంబులెన్స్ డ్రైవర్​పై దాడి జరిగింది. దీంతో అతడు పోలీస్ స్టేషన్​కు రాగా.., నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా..నీకు కరోనా ఉంటుంది. ముందు పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లాలని స్టేషన్​లోని ఓఉన్నతాధికారి హుకూం జారీ చేశారు. సార్.. మీరు కాపాడకపోతే నా ప్రాణాలకే ప్రమాదమని, మీ కాళ్లు మొక్కుతానని వేడుకున్నా కనికరించకుండా బుతూలు తిడుతూ వెళ్లగొట్టాడని సదరు బాధితుడు విలేకరులతో బాధను వెలిబుచ్చాడు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో వస్తున్నా పైస్థాయి అధికారులు ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో హయత్​నగర్​ ఠాణాలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed