ఎయిర్ఇండియా‌కు షాక్.. సీఈఓగా ఉండనని స్పష్టం చేసిన ఇల్కర్ ఐచీ..!

by Disha News Web Desk |
ఎయిర్ఇండియా‌కు షాక్.. సీఈఓగా ఉండనని స్పష్టం చేసిన ఇల్కర్ ఐచీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టాటా గ్రూప్ ఇటీవల విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను తిరిగి దక్కించుకున్న తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయమే బెడిసికొట్టింది. ఇటీవల ఎయిర్ఇండియాకు కొత్త సీఈఓగా ఇల్కర్ ఐచీ నియామకాన్ని టాటా సంస్థ ఖరారు చేసింది. అయితే, తర్వాతి పరిణామాల్లో ఆయన నియామకంపై వచ్చిన వ్యతిరేకతల వల్ల బాధ్యతలను చేపట్టనని ఇల్కర్ ఐచీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తన మునుపటి రాజకీయ సంబంధాలపై వచ్చిన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్ ఎయిర్ఇండియాను దక్కించుకున్న తర్వాత సంస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎయిర్ఇండియా సీఈఓ బాధ్యతలను మాజీ టర్కీష్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్, బోర్డు సభ్యుడిగా పనిచేసిన ఇల్కర్ ఐచీకి అప్పగిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సీఈఓగా బాధ్యతలను చేపడతారని కూడా ప్రకటించింది. కానీ, ఆయన నియామకం పట్ల ఆర్ఎస్ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇల్కర్ ఐచీ నియామకాన్ని ప్రభుత్వం అనుమతించరాదని వివరించింది. ఈ నేపథ్యంలో తన నియామకం పట్ల వచ్చిన అభ్యంతరాల మధ్య సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టలేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story