ఆయన రాజకీయం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు: తమ్మినేని సీతారాం

by Disha News Web Desk |
ఆయన రాజకీయం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు: తమ్మినేని సీతారాం
X

దిశ, ఏపీ బ్యూరో: సినిమాలను రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీపై చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడూ లేని విధంగా ట్వీట్స్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయ లబ్ధికోసం సినిమా రంగాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ వారసుడుగా టీడీపీ కోసం ఎంతో శ్రమించిన జూనియర్‌ ఎన్టీఆర్ సినిమాకోసం ఏనాడూ చంద్రబాబు, లోకేశ్ ఆలోచించలేదని మండిపడ్డారు. రాజకీయం, స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారని, ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని స్పీకర్ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇవ్వనుందని నివేదిక ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని నాడు సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూనియర్‌ ఎన్టీఆర్‌, చిరంజీవి సినిమాల విషయంలో ఇబ్బందులు పెట్టారని, సినిమా బాగుంటే ఆడుతుందని, అఖండ, చిన్న సినిమా డీజే టిల్లు బాగా ఆడిన విషయాన్ని సీతారాం చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అయినా అకిరానందన్ అయినా ఒకటేనని, జీవో రాకముందే సినిమా రిలీజ్ చేసి, రాద్దాంతం చేయడం సరికాదని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వాయిదా వేసిన పవన్ కల్యాణ్ మరో నాలుగు రోజులు రిలీజ్ వాయిదా వేసుకుంటే అనుకున్నట్లు షోలు, రేట్లు పాజిటివ్ వచ్చేవంటూ సెటైర్లు వేశారు. సినీపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని స్పీకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనుకుంటే అది ప్రభుత్వానికి సాధ్యపడదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

Advertisement

Next Story