ఆ వ్యవహారంలో భారత్, చైనా సుముఖతం

by Shamantha N |
ఆ వ్యవహారంలో భారత్, చైనా సుముఖతం
X

న్యూఢిల్లీ: దాదాపు నెల రోజులుగా భారత్, చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ సమీపంలో ఏర్పడ్డ ఉద్రిక్తతలు త్వరలో తొలగిపోనున్నట్టు తెలుస్తున్నది. ఈ వైపుగా ఇరుదేశాలూ సుముఖంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ ప్రకటన తెలుపుతోంది. ఇప్పటికే ఈ సమస్యపై శనివారం ఇరుదేశాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల తర్వాతి రోజే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు భారత్, చైనాలు అంగీకరించినట్టు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ఇరుదేశాల మధ్యనున్న సరిహద్దు కీలకాంశంగా ఉన్నదని తెలిపింది. అయితే, శనివారంనాటి చర్చల తర్వాతా మిలిటరీ, డిప్లమాటిక్ స్థాయిలో సమావేశాలు జరుగుతాయని సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ సమస్యకు పరిష్కారంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని వివరించింది. సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ఇరువైపుల నుంచి మిలటరీ, డిప్లమాటిక్ స్థాయిలో ప్రతినిధులు పాల్గొని చర్చించనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed