మోనోపాలి దిశగా భారతదేశం! ప్రత్యామ్నాయం ఏంటి?

by Ravi |   ( Updated:2022-10-13 19:15:45.0  )
మోనోపాలి దిశగా భారతదేశం! ప్రత్యామ్నాయం ఏంటి?
X

ఎన్నికలలో డబ్బు ప్రభావం పెరిగింది. లాభాలలో ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ఓఎన్‌జీ‌సీ, గైల్, సీఐఎల్, పవర్‌లాంటి పరిశ్రమలు రూ. 5 వేల నుంచి రూ.13 వేల కోట్ల లాభాలలో ఉన్నాయి. ఏడు సంవత్సరాలుగా 64 కంపెనీలు, ఐదారేళ్ల నుంచి 115 సంస్థలు నష్టాలలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఆరు లక్షల కోట్లు గడించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. 2025 నాటికి దీనిని సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లక్ష కోట్లు లాభాలలో ఉన్నవాటిని కూడా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ చేతులలో పెట్టేసి వారిని అందులో మోనోపోలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరి ఆలోచన ఇది. అంతా సర్కార్‌కు అనుకూలంగా ఉండాలనేదే బీజేపీ లక్ష్యం.

దేశంలో రాజకీయం, వ్యాపారం, పారిశ్రామిక, మీడియా, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలలోనూ ఏకాధికారం, మోనోపొలిజం కోసం ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 'చాప కింద నీరులా' ఇది జరుగుతున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడం మొదలు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇతర ప్రజా ప్రతినిధులను బీజేపీలో చేర్చుకోవడం కొనసాగుతున్నది. అవినీతి, అక్రమాలకు పాల్పడి కేసులలో ఉన్నవారిని, లేని వారిని ఈడీ, సీబీఐ, ఐటీ కేసులలో జైలుకు పంపడం, బీజేపీలో చేరితే అది ఎంత పెద్ద కేసు అయినా మాఫీ చేయడం షరా మామూలు అయిపోయింది.

మహారాష్ట్రలో ముగ్గురు, బెంగాల్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఇద్దరు మంత్రులను కేసులు పెట్టి జైలుకు పంపారు. బెంగాల్‌లో ఒక మంత్రి అనుచరుడి వద్ద కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇది చాలా పెద్ద అవినీతి కేసుగా పేర్కొనవచ్చు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఒక గనిని తన పేరిట చేసుకుని ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇటు హిందూ-ముస్లిం అంటూ మనుషులను విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, దాడులు, కేసులు కొనసాగుతున్నాయి. ఇదంతా అధికారం కాపాడుకోవడం కోసమేనని వేరుగా చెప్పనవసరం లేదు కదా! అరెస్టులు, బుల్‌డోజర్లతో ఇండ్లు కూల్చడం, పోలీసులు బహిరంగంగానే కొందరిని కరెంట్ పోల్‌కు కట్టేసి బాదడం, ఈ చోద్యం చూసే జనం దానిని చప్పట్లతో సమర్థించడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మాటలు వేరు, చేతలు వేరు

ఎన్నికలలో డబ్బు ప్రభావం పెరిగింది. లాభాలలో ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ఓఎన్‌జీ‌సీ, గైల్, సీఐఎల్, పవర్‌లాంటి పరిశ్రమలు రూ. 5 వేల నుంచి రూ.13 వేల కోట్ల లాభాలలో ఉన్నాయి. ఏడు సంవత్సరాలుగా 64 కంపెనీలు, ఐదారేళ్ల నుంచి 115 సంస్థలు నష్టాలలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఆరు లక్షల కోట్లు గడించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. 2025 నాటికి దీనిని సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లక్ష కోట్లు లాభాలలో ఉన్న వాటిని కూడా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ చేతులలో పెట్టేసి వారిని అందులో మోనోపోలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరి ఆలోచన ఇది. అంతా సర్కార్‌కు అనుకూలంగా ఉండాలనేదే బీజేపీ లక్ష్యం. రాజకీయ బిచ్చగాళ్లు జోలెలు పట్టుకుని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతారు. ఓట్ల కోసం, అధికారం కోసం అప్పులు చేసి పథకాలు తెస్తారు. అవి కూడా వరల్డ్ బ్యాంక్ కనుసన్నలలోనే ఉంటాయి. విశ్వగురు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ముచ్చట్లు చెబుతారు. నిజానికి ఇప్పుడు త్రి ట్రిలియన్ ఎకానమీ వద్దే ఉన్నాం. 2026 వరకు ఫోర్ ట్రిలియన్‌కు చేరే అవకాశం ఉందని విశ్వ బ్యాంక్, ఐఎంఎఫ్ చెబుతోంది.

Also read: దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదా?

పెరుగుతున్న పేదరికం

భారత్‌లో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, నిత్యావసరాల ధరలు గడచిన 40 యేండ్లలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో 7 కోట్ల 80 లక్షల 35 వేల మంది పేదరికంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకు ఒకరి సగటు ఆదాయం 770 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 930 రూపాయలుగా ఉంది. దళితులలో 64 శాతం నిరుపేదలు ఉన్నారు. 45 శాతం పేదలు గ్రామాలలో, 35 శాతం పేదలు పట్టణాలలో ఉన్నారు. గుజరాత్‌ గ్రామీణ ప్రాంతాలలో 22 శాతం, పట్టణ ప్రాంతాలలో 16 శాతం పేదలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ(rahul gandhi) 'భారత్ జోడో యాత్ర' ద్వారా దేశ కాలమాన స్థితిగతులను తెలుసుకుంటున్నారు.

ప్రత్యామ్నాయం అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. విద్వేష రాజకీయాలను పర్యవసానాల గురించి వివరిస్తున్నారు. శాంతి, సద్భావన, మనుషులలో ప్రేమ, పరస్పర సహకారం ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నారు. ఆయన మాట్లాడడం తక్కువ. వినడం ఎక్కువ కనిపిస్తున్నది. పాదయాత్రలో తన తల్లి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(sonia gandhi) పాల్గొన్నప్పుడు ఆమె కాలి బూట్ల లేసు ఊడిపోతే వంగి కట్టిన తీరు, తల్లి భుజాల మీద చేయి వేసి నడవడం, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగో లేనందున 'నడిచింది చాలు' అని ఆమెను ఒప్పించి కారు ఎక్కించిన తీరు అంతా సహజంగానే కనిపించింది. తల్లి కాళ్లు కడిగినా, మొక్కినా మీడియాను వెంటేసుకుని వెళ్లి హంగామా చేసే నేతలు, పాలకులు ఉన్న మన దేశంలో రాహుల్ పాదయాత్రలో వ్యవహరిస్తున్న తీరు ఆదర్శంగా ఉందని పేర్కొనక తప్పదు.

కష్టసుఖాలను తెలుసుకుంటూ

కరోనా కాలంలో ఆక్సిజన్ లభించక తన తండ్రి మరణించిన సంఘటనను యాత్రలో ఒక అమ్మాయి వివరిస్తుంటే రాహుల్ సహా అందరి కండ్లు చెమర్చాయి, ఇలాంటి కష్టాలు ఎన్నో రాహుల్ వింటూ ఈ భారత్ జోడో యాత్రలో కొనసాగుతున్నారు. 'విపరీత వేడి తర్వాత వచ్చే ఒక చల్లని గాలిలా' ఆయన యాత్ర(bharat jodo yatra) సాగుతున్నది. పదవులకు, ఎన్నికల ప్రచారాలకు దూరంగా ప్రజలతో మమేకమై వెళుతున్న నేత మాదిరి ఆయన కనిపిస్తున్నారు. దేశంలోని ప్రతీ రంగాన్ని కార్పొరేట్‌లకు ధారాదత్తం చేసి ఏకాధికారం కొనసాగించాలని సాగుతున్న కుట్రను బుద్ధిజీవులు అర్థం చేసుకోవాలి. ఇండియన్ ఎకనామీని మోనోపొలైజ్ చేయడం, రాజ్యాధికారం కూడా అలాగే నిలుపుకోవాలనుకునే కుట్రను అర్థం చేసుకోవాలి. వినియోగదారుడు ఎప్పుడు కూడా కింగ్ కాలేడు.

మార్కెట్ కింగ్ అవుతుంది. ఇప్పుడు ఇదే మార్కెట్ కార్పొరేట్‌లకు సొంతం చేసి, తాము అధికారం చెలాయించాలని భావిస్తున్నారు. గడచిన ఆరు నెలలలో దేశంలో దిగుమతి పెరిగి, ఎగుమతి తగ్గి లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉత్పత్తులు తగ్గాయి. కష్టపడి చేసుకోవడానికి పని లేదు. స్వయంగా పీఎం ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదనం స్వాధీనం, ఒక్కో పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ, ధరలు తగ్గింపు హుష్ కాకి అయిపోయాయి. కేంద్రం హామీలు, వైఫల్యాలు గురించి బీజేపీ నేతలు మాట్లాడరు కానీ, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం ఉద్యోగాల భర్తీ, అదీ, ఇదీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. విపక్షాలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చి దేశంలో ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించాలి. అప్పుడే తగిన ఫలితాలు ఉంటాయి.

Also read: కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కోసమే ఇదంతా!


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story

Most Viewed