జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మైండ్ గేమ్ !

by Shyam |
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మైండ్ గేమ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బైపోల్‌లో సెన్సేషనల్ హిట్‌ కొట్టి దూకుడు మీదున్న బీజేపీ.. తెలంగాణలో తనదైన స్టైల్లో పాలి‘ట్రిక్స్‌’మొదలు పెట్టిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వెయ్యి ఓట్ల మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థిపై నెగ్గి.. ఇప్పుడు ఏకంగా బల్దియా ఎలక్షన్స్‌లో కుర్చీ కోసం తహతహలాడుతుండటం రాజకీయ పార్టీలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. గత ఎన్నికల్లో 5సీట్లలోపే పరిమితమై, ఇప్పుడు ఏకంగా బల్దియాను చేతుల్లోకి తీసుకునేందుకు తెస్తున్న హైప్‌.. మరీ అంత సీనుందా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేస్తుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 150డివిజన్లు ఉండగా.. ఏ లెక్కన చూసినా ఎంఐఎంకు 35నుంచి 45సీట్ల వరకు ఖచ్చితంగా వస్తాయని ఆపార్టీ నేతలు ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. ఇదివరకూ అదే జరిగింది. గత ఎన్నికల్లో సెంచరీ మిస్ చేసుకొని 99సీట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి ఏకంగా 100సీట్లు గెలుస్తామని చెబుతుంటే, బీజేపీ నేతలు మాత్రం తమదే బల్దియా పీఠం అని కలలు కంటున్నారు. కానీ, ఒకవేళ టీఆర్ఎస్‌కు సగానికి సగం తగ్గి 50సీట్లు, ఎంఐఎంకు 40 సీట్లు వచ్చినా, కాంగ్రెస్‌‌ సీట్లు కొన్ని, ఇండిపెండెంట్ అభ్యర్థులను లెక్కలోకి తీసుకుంటే అప్పుడు బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ననే లెక్కలు వేసుకుంటున్నారు.

ఒకవేళ ఇవన్నీ పక్కనపెట్టి ఎక్స్‌అఫీషియో ఓటర్లను లెక్కలోకి తీసుకున్నా బీజేపీకి కుర్చీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. బల్దియాలో 150 డివిజన్లు ఉండగా, 52ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్‌కు 38, ఎంఐఎం 10, బీజేపీ 3, కాంగ్రెస్‌ 1 ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 150+52=202 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్‌ 102గా ఉంటుంది. టీఆర్ఎస్‌ కనీసం 30డివిజన్లు గెలిచినా ఎక్స్‌అఫీషియో ఓట్లు(38)తో కలుపుకొని మొత్తం 68అవుతాయి. ఎంఐఎం 40సీట్లు గెలుస్తుందని భావించినా, ఆపార్టీకి ఉన్న 10 ఎక్స్‌అఫీషియో ఓట్లతో కలుపుకొని వీళ్లవే 118 ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఎంఐఎం బీజేపీకి సపోర్టు చేసే అవకాశం లేనందున గ్రేటర్‌ కుర్చీ టీఆర్ఎస్ లేదా ఎంఐఎం‌ మాత్రమే దక్కించుకుంటాయి.

లేకుంటే ఇవన్నీకాకుండా బీజేపీయే డైరెక్ట్‌గా మేయర్‌ సీటును దక్కించుకోవాలంటే 99డివిజన్లు గెలిచి, 3ఎక్స్‌ అఫిషియో ఓట్లతో 102 మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్‌లో గోషామహల్‌లో తప్ప బీజేపీకి ఎక్కడా ఎమ్మెల్యేలు లేరు. మొత్తం టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులే ఉండటంతో వారిదే హవా నడిచి ఓట్లు అటువైపే మళ్లే అవకాశాలు ఉన్నాయి. అయినా తమదే గ్రేటర్ పీఠమని చెప్పుకుంటూ పార్టీలు, ప్రజలతో బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందని రాజకీయ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

జీహెచ్ఎంసీకి ప్రత్యేక చట్టం…

జీహెచ్ఎంసీ ప్రత్యేక చట్టం ప్రకారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. కౌన్సిల్ సమావేశంలో పాల్గొనక పోయినా.. మేయర్‌ను ఎన్నుకునే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఓటు వేయాలన్న నిబంధన ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ తక్కువ డివిజన్లు గెలిచినా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్‌ సీటును కైవసం చేసుకుంటుంది. అయినా.. బలం సరిపోకుంటే ఎంఐఎం సపోర్టుతో బల్దియాపై మళ్లీ టీఆర్ఎస్‌ జెండా ఎగరవేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత బలం ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి ఏవిధంగా జీహెచ్ఎంసీ మేయర్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నది ఆశ్చర్యంగా మారింది.

Advertisement

Next Story