ముంపు స‌హాయాన్ని స్వాహా చేసింది బీజేపీ నాయ‌కులే

by Shyam |
ముంపు స‌హాయాన్ని స్వాహా చేసింది బీజేపీ నాయ‌కులే
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: ముంపు స‌హాయాన్ని గోషామ‌హ‌ల్ బీజేపీ నాయ‌కులే స్వాహా చేశార‌ని, ఈ విష‌యంలో హై కోర్ట్ సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీ‌సుకోవాల‌ని సొంత పార్టీ నాయ‌కులే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌భ్యులు, బ‌జ‌రంగ్‌ దళ్ మాజీ అధ్య‌క్షుడు టీ. య‌మ‌న్ సింగ్ శ‌నివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే పీఏగా చ‌లామ‌ణి అవుతున్న వ్య‌క్తితో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ అధ్య‌క్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా చెప్పుకుంటున్న నాయ‌కులే ప్ర‌జ‌ల వ‌ద్ద ఆధార్ కార్డులు సేక‌రించి ముంపు స‌హాయాన్ని కాజేశార‌ని ఆరోపించారు. మ‌ల్ల‌న్న గుట్ట ప్రాంతంలో 72 ఇళ్లు ఉండ‌గా వారంద‌రి వ‌ద్ద ఆధార్ కార్డులు సేక‌రించి అధికారుల‌తో కుమ్మ‌కై ముంపు స‌హాయాన్ని వారు మింగేశార‌ని అన్నారు. త‌మ‌కు ఆర్థిక స‌హాయం అంద‌లేద‌ని అధికారుల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు సంప్ర‌దించ‌గా అప్ప‌టికే న‌గ‌దు ఇచ్చిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయ‌ని అధికారులు తేల్చ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ని అన్నారు. దీనిపై వెంట‌నే హైకోర్ట్ సిట్టింగ్ జ‌డ్డితో విచార‌ణ జ‌రిపించాలనీ, క‌మీష‌న్లు తీసుకున్న బ్రోక‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన వారిపై ఉన్న‌తాధికారుల‌తో పాటు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed