ఆ రెండింటిపై బీజేపీ గురి

by Shyam |
ఆ రెండింటిపై బీజేపీ గురి
X

దిశ, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పీఠంపై బీజేపీ గురి పెట్టింది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలు సాధించిన ఆ పార్టీ, స్థానిక, మున్సిపాలిటీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. సరిగ్గా ఏడాది వ్యవధిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున బీజేపీ ఇప్పటి నుంచే తన ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నందున ఆ పార్టీ బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో మత రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యత ఉండే బల్దియాపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే మార్చి 15న నగరంలోని ఎల్బీస్టేడియంలో సీఏఏకు మద్దతుగా పెద్ద ఎత్తున సభ నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరు కానున్నారు. సీఏఏ సభ సక్సెస్ అయ్యేందుకు బీజేపీ మూడు రోజులుగా నగరంలో నియోజకవర్గాలవారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ముషీరాబాద్, అంబర్‌పేట్ నియోజకవర్గాల సమావేశంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించారు. అయితే నగరంలో మజ్లిస్ పార్టీపై విమర్శలు చేయడంతోపాటు మజ్లిస్-టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేననే సంకేతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సీఏఏ ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదనీ, భారతీయులందరికీ అవసరమైందనే విషయాలను కార్యకర్తలకు బోధిస్తున్నారు.
ఈ సమావేశాల్లో సీఏఏ సభను విజయవంతం చేయాలని చెబుతూనే గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. సీఏఏ సభ విజయవంతంతో వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్న బల్దియా పాలక మండలిలో తన సత్తాను చాటి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో బీజేపీ నలుగురు కార్పొరేటర్లను గెలుచుకుంది. సీఏఏ సభను విజయవంతం చేసుకుని, అదే జోష్‌ను బల్దియా ఎన్నికల దాకా తీసుకెళ్ళాలని బీజేపీ భావిస్తోంది. అందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రామచంద్రరావులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంపై ఎక్కుపెట్టిన డ్యూయల్ గురి సక్సెస్ అవుతుందో.. లేదో చూడాలి మరి.

Advertisement

Next Story