రెండేళ్లయినా అతీగతీ లేదు.. అస్తవ్యస్తంగా మారిన బయో మెడికల్ వేస్టేజ్

by Shyam |   ( Updated:2021-09-17 22:43:56.0  )
రెండేళ్లయినా అతీగతీ లేదు.. అస్తవ్యస్తంగా మారిన బయో మెడికల్ వేస్టేజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ చెత్తలోనే బయో మెడికల్ వేస్ట్ ను కలిపేస్తున్నాయి… ఇదీ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించింది… వాటిపై చర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కానీ నేటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆసుపత్రులు యథావిధిగా అదే వ్యవహారశైలీని అనురిస్తుండటంతో ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం మరోమారు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.

తెలంగాణలో పీసీబీ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 4200 ఆస్పత్రులుండగా…గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1500పైగా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో సుమారు 350 ఆస్పత్రులు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పని చేస్తున్నాయి. సాధారణ చెత్తలోనే బయోమెడికల్‌ వేస్ట్‌ను కలిపేస్తూ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి. అంతేకాదు రక్తపు మరకలతో కూడిన బెడ్‌షీట్లను నగరం సమీపంలోని చెరువుల్లో ఉతకడం వల్ల చెరువులోని నీరు కలుషితమవుతోంది. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిన ఈ బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణలో అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ 2019లో డిసెంబర్ 28న తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై రెండేళ్ల క్రితం గవర్నర్‌ దృష్టి కి తీసుకెళ్లినా స్పందన కరువైందని మరోమారు గవర్నర్ కు లేఖరాయనున్నట్లు ఫోరం కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి తెలిపారు.

సూదిమందు… వాడిపడేసిన కాటన్‌…టానిక్‌ సీసా….ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయా..? వాటిలోని బ్యాక్టిరియా, వైరస్‌లు స్వేచ్ఛగా నగర వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయా..? ఏటా ఆస్పత్రి వ్యర్థాలను ఆరుబయట తగులబెడుతుండడంతో 20 శాతం మంది అంటు రోగాల బారిన పడుతున్నారా..? వీటన్నింటికీ నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలకు చిరునామాగా..మెడికల్‌ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడపుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.02 లక్షల పడకలు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్‌ నుంచి నిత్యం 35 టన్నులు, నగరానికి ఆను కొని ఉన్న శివారు ప్రాంతాల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్ధాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్‌ ఆస్పత్రులు మినహా ఇతరత్రా చిన్నా పెద్దా ఆస్పత్రులు శాస్త్రీయ పద్దతిలోకాకుండా సాధారణ చెత్తతోపాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు గాలిలో కలిసి పలు రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీగా వెలువడుతున్న చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్దతిలో రీసైక్లింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణా సమయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గాంధీ,ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్‌ సహా పలు చిన్నాస్పత్రుల యాజమాన్యాలు తరచూ సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమౌతోంది. ఈ పొగ పీల్చుకున్నవారిలో 20 శాతం మంది అంటు రోగాల బారినపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆస్పత్రి వ్యర్థాలను వేరుచేసి వేర్వేరు డబ్బాల్లో నింపే విషయంలోనూ పలు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

వ్యర్థాలను వేరు చేయాల్సింది ఇలా…

-పసుపు రంగు డబ్బా/ కవర్‌: మానవ, జంతు, శరీర అవయవాలు, రక్తంతో కూడిన భాగాలు, ప్రయోగశాలల వ్యర్థాలు నిల్వచేయాలి.
-ఎరుపురంగుడబ్బా/ కవర్‌: రక్తంతో తడిసిన సామాగ్రి, కాటన్, డ్రెస్సింగ్‌ మెటీరియల్, ప్లాస్టర్లు, సిరంజిలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు.
-నలుపురంగు డబ్బా/ కవర్‌: కాలం చెల్లిన మందులు, సూదులు, బ్లేడులు, ఇతర పదునైన వస్తువులు
నేరేడురంగు డబ్బా/ కవర్‌: కేన్సర్‌కు వాడే మందులు, సంబంధిత వ్యర్థాలు.

ఆస్పత్రి వ్యర్థాలతో అనర్థాలివే…

-హెచ్‌ఐవీ,ఎయిడ్స్‌రోగులు వాడిపడేసిన సూదులు,బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది.
-హెపటైటిస్‌ బి వంటి రోగాలు ప్రబలుతాయి.
-చీము తుడిచిన కాటన్‌ను వృథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది.
-ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా,వైరస్‌ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ,శ్వాసకోశ,చర్మ వ్యాధులు ప్రభలుతాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా..

ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హానితలపెట్టని రీతిలో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్‌ తదితర దేశాల్లో ఖననం చేస్తున్నారు. ఆస్పత్రి వ్యర్థాల్లో పలు రకాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిలో గోతి తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతు న్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆస్పత్రి వ్యర్థాలను సాధారణ చెత్తతో పాటే బయటపడవేయొద్దని పీసీబీ చేసిన సూచనను ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. సాధారణ చెత్తతో పాటే జీవవ్యర్థాలను పడేయడం, డంపింగ్‌ యార్డుకు తరలించడం, ఆరుబయట తగులబెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్న ఆస్పత్రుల యాజమాన్యాల నిర్వాకాలను కట్టడిచేసేందుకు పీసీబీ నిత్యం తనిఖీలు నిర్వహించాలి. కానీ అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో పరిస్థితి విషమిస్తోంది.

ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు- ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రోగుల రక్తంతో తడిన దుప్పట్లు, సర్జికల్‌ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటం వల్ల చెరువులోని నీరు కలుషితమవుతుంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టార్జాంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. అయినా స్పందన రాకపోవడంతో రెండు రోజుల క్రితం 2019 డిసెంబర్ 28న గవర్నర్ కు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాం. ఇప్పటికీ స్పందన రాలేదు. మరోమారు గవర్నర్ కు లేఖ రాస్తాం.

Advertisement

Next Story