షీ టీమ్‌లకు బైక్‌లు 

by Shyam |
షీ టీమ్‌లకు బైక్‌లు 
X

దిశ, క్రైమ్ బ్యూరో: మహిళలను ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిల ఆట కట్టించే షీ బృందాలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ బైక్ లను అందజేశారు. ఈ సందర్భంగా గోషామహాల్ స్టేడియంలో సోమవారం ఆయన జెండా ఊపి బైక్ లను ప్రారంభించారు. హోం మంత్రి మాట్లాడుతూ.. నగరంలో మహిళలు, పిల్లల పట్ల లైంగిక వేధింపుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు పోకిరీలను, ఆకతాయిలను వెంటనే పట్టుకోవడానికి బైక్‌లు అందుబాటులో ఉండటం అవసరం అన్నారు. హైదరాబాద్ సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరానికి 60 బైక్‌లు మంజూరు అయినట్టు తెలిపారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ షీ టీమ్ బృందాలకు 27, సైబరాబాద్ కమిషనరేట్‌కు 17 బైక్ లు, రాచకొండ కమిషనరేట్ కు 16 బైక్ లు కేటాయించినట్టు తెలిపారు. మహిళల భద్రతకు భరోసా అందించే షీ టీమ్ సేవలను హోం మంత్రి అభినందించారు.

సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో ఈవ్ టీజర్ల ఆట కట్టించడానికి షీ టీమ్ బృందాల సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు బైక్ లు ఎంతో దోహదపడతాయని అన్నారు. డయల్ 100, వాట్సాప్, ఫేస్ బుక్ తదితర వేదికల ద్వారా బాధితులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటి వరకూ 8 వేల ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు. ప్రతి మహిళా బహిరంగ ప్రదేశాలలో తనను తాను సంరక్షించుకోవడానికి ధైర్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. షీ టీమ్ ద్వార మహిళలు భరోసా లభించిందని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీలు శిఖా గోయెల్, డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేష్, డీసీపీలు ఎల్‌ఎస్ చౌహాన్, కరుణాకర్, సైబరాబాద్ డీసీపీ అనసూయ, రాచకొండ డీసీపీ సలీమ, షీ టీమ్ అడిషనల్ డీసీపీ శిరీషా రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed