- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Disha Special : అడవి బిడ్డల జాతర.. నాగోబా

జాతర హైలైట్స్
జనవరి 28
మహా పూజ
జనవరి 29
విశ్రాంతి
జనవరి 30
పేర్సాపెన్
జనవరి 31
నాగోబా దర్బార్
ఫిబ్రవరి 1
బేతల్ పూజలు, మండగాజిలింగ్
ఫిబ్రవరి 2
షాంపూర్ జాతర
సందిర్కున్ సుఖ్ శాంతి సియనా
పంటాచొక్కోట్ పండానా
నాగోబా పేన్దున్ పొరో భరోసా ఇర్తర్వోనా
(నాగోబాను మెస్రం వంశీయులు గోండు భాషలో ఇలా పూజిస్తారు.. దానికి అర్థం ఇది.)
అందరికీ సుఖశాంతిని ఇవ్వు
పంటలు మంచిగా పండాలి
నాగోబాపై భరోసా ఉంచితే అంతా మంచే జరుగుతుంది
భారతదేశ ఆదివాసీల ఆచార సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. పంచభూతాల ఆరాధనే ఆచారంగా వ్యవహరిస్తారు. నేటికీ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన నాగోబాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నాగోబా జాతర ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగించడంతో పాటు చూడముచ్చటగా ఉంటాయి. అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న సమ్మక్క సారలమ్మ తర్వాత దేశంలోనే నాగోబా జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరలో ఆదివాసులు సర్ప జాతిని పూజిస్తారు. ప్రతి ఏటా పుష్య మాసంలో వచ్చే అమావాస్య అర్ధరాత్రి నుంచి జాతర మొదలై వరుసగా ఐదురోజులపాటు కొనసాగుతుంది. ఈ ఏడాది జనవరి 28న మొదలై ఫిబ్రవరి 2వ తేదీతో ముగుస్తుంది. -మడావి సురేశ్/శారదా కృష్ణ మోహన్
నాగోబా చరిత్ర
పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన రాణికి నాగేంద్రుడు కలలో కనిపిస్తాడు. సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని వరం ఇస్తాడు. ఆ కల నిజమైందని గోండులకు ప్రగాఢ నమ్మకం. ఆ నాగేంద్రుడికి తన తమ్ముడి కూతురు గౌరితో రాణి వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం అవుతుంది. ఆ తర్వాత గౌరి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారుతాడు. అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని గోండుల విశ్వాసం. ఆ తరువాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి.. గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోతుంది. నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (బేటింగ్) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతిఏటా మహాపూజ జరిగే సమయంలో నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గోండుల నమ్మకం. దీనికి ప్రతీకగా ప్రతి ఏడాది మెస్రం వంశీయులు పుష్యమాసంలో ప్రతి ఏడాది గోదావరి జలంతో నాగదేవుడికి అభిషేకం చేసి సంస్కృతి సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభిస్తారు.
కాలినడకన గంగాజల సేకరణ
అమావాస్య రోజున మెస్రం వంశీయులు మురాడీ వద్ద చేరుకొని నెలవంకను చూసి మొక్కుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. వరుసటి రోజు తెల్లవారు జామున మురాడి వద్ద సంప్రదాయ ప్రకారం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మహా పూజ, జాతరపై చర్చిస్తారు. అనంతరం అదే రోజు మహా పూజకు కావాల్సిన కుండలను సిరికొండ మండలంలోని గుగ్గిళ్ళ స్వామి వద్దకు చేరుకొని కుండలు తయారు చేయాలని చెప్తారు. అనంతరం నాగోబా జాతర మహాపూజకు అవసరమయ్యే గంగాజల సేకరణకు మెస్రం వంశీయులు మురాడి వద్ద సమావేశం అవుతారు. అక్కడ భద్రపరిచిన గోదావరిజల ఝరిని సంప్రదాయకంగా పూజిస్తారు. గోదావరిజలం తీసుకొచ్చే ఝరిని కటోడ వీపుపై తెల్ల వస్త్రంతో కట్టి గోదావరిజలం సేకరణ కోసం కాలినడకన ఒకే వరుసలో తెల్లని దుస్తులతో బయలుదేరుతారు. ఎంతమంది ఉన్నా.. ఒకే వరుసలో నడుస్తారు. అందరూ తెల్లటి దుస్తులు.. తలకు పాగా ధరిస్తారు. కేస్లాపూర్ నుండి బయలుదేరిన మెస్రం వంశీయులు జన్నారం మండలంలోని హస్తినమడుగు వద్దకు చేరుకొని పవిత్ర గోదావరికి ప్రత్యేక పూజలు చేసి జలాన్ని సేకరించిన తర్వాత ఝరితో తిరుగు ప్రయాణం అవుతారు.
మెస్రం వంశీయులు
నాగోబా దేవతకు మేస్రం వంశీయులే పూజలు నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు ఉంటాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంగా పరిగణిస్తారు. మెస్త్రం వంశీయుల్లోని కటోడా (దేవుడిని పట్టుకునేవాళ్లు), పటాడి (పెప్రే, కాలికోం వాయిద్యాలు వాయించేవారు) శాఖల వారు పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు. మెస్రం ఈ ఏడు శాఖలవారు వారి వెంట వెళతారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.
ఇంద్రవెల్లి కి చేరుకొని..
ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్ర దేవి వద్ద మెస్రంవంశీయులు వివిధ ప్రాంతాల నుంచి ఒక చోట చేరుకొని మెస్రం వంశీయులు ఇంద్ర దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరుసటి రోజున కేస్లాపూర్ జాతరలోని మర్రి చెట్టు వద్దకు మెస్రం వంశీయులు ఎడ్ల బండ్ల ద్వారా తరలి వస్తారు. మరి చెట్టు వద్ద చేరుకొని మూడో రోజులపాటు అక్కడే భాస చేసి (కర్మ కండ) తూమ్ పూజలు నిర్వహిస్తారు. మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులకు మెస్రం ప్రదాన్ కిక్రి వాయిస్తూ నాగోబా కథను పాట రూపంలో వినిపిస్తారు. సిరికొండ మండల కేంద్రంలో గుగ్గిళ్ళ స్వామి తయారు చేయించిన మట్టి కుండాలను కొనుగోలు చేసి తీసుకొని వస్తారు. మెస్రం వంశీయుల పటేల్ కితకు చెందిన మెస్రం వంశీయులను మర్రి చెట్టు వద్ద ఇతర మెస్రం వంశీయులు ప్రత్యేక స్వాగతం పలుకుతారు.
అర్ధరాత్రి నాగోబా జాతర మహాపూజ
మట్టి కుండలలో సేకరించిన పవిత్ర గోదావరి జలాన్ని సంస్కృతిక సంప్రదాయాలతో డోలు సన్నాయి వాయిస్తూ అంగరంగ వైభవంగా కాలినడక తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో చేరుకొని అక్కడి మసిమల్ (పోచ్చమ్మ) తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయంలో ప్రవేశించి ఆలయాన్ని పవిత్ర నీటితో శుద్ధి చేసి నాగోబా విగ్రహాన్ని అభిషేకం చేసి నవధాన్యాలతో నైవేద్యం సమర్పిస్తారు. అర్ధరాత్రి అంగరంగ వైభవంగా మహా పూజ నిర్వహిస్తారు. నాగోబా జాతరకు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతర ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.
పేర్సాపెన్
మహాపూజ అనంతరం ఒకరోజు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజున పేర్సాపెన్ ఉత్సవాన్ని మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. ఈ రోజున కొత్త కోడళ్లు మట్టితో కుండలను తయారుచేసి.. దేవుడికి పూజలు చేస్తారు. ఈ రోజు వారు దేవుడికి పూజలు చేసేందుకు అనుమతి లభిస్తుంది.
దర్బార్
నాగోబా జాతర దర్బార్ రోజు ఏడాది పొడవునా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పెద్దలకు చెప్పుకుంటారు. వారి సూచించిన మార్గాలను మిగితా అందరూ పాటిస్తారు. ఇది తరాలుగా సాగుతున్నది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ అధికారులు కూడా దర్బార్ కు హాజరై.. వారి సమస్యలను విని తగిన పరిష్కారాలు చూపుతారు. సమస్యల పరిష్కారానికి ఇది గోండులు ఏర్పాటుచేసుకున్న వేదిక. శుక్రవారం (జనవరి 31న)జరిగే దర్బార్‌కు మంత్రి సీతక్క హాజరుకానున్నారు.
జాతర ముగింపు
బేతల్ దేవతకు సంప్రదయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం మెస్రం వంశీయులు వేరువేరుగా కర్రలతో ఆడుతూ బెతల్ నృత్యాలు చేస్తూ నాగోబా జాతర ముగింపు పలుకుతారు.
ఆచారాలు.. సంప్రదాయాలు
బెటింగ్
మెస్రం వంశీయుల్లో అనేక వింత సంప్రదాయాలు ఉన్నాయి. ఇతరులతో అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది బెటింగ్.. అంటే పరిచయం. కొత్తగా పెళ్లయిన జంటలను నాగోబా జాతర వేదికగా అందరికీ పరిచయం చేస్తారు. అదే విధంగా కొత్తకోడళ్లను ఇదే వేదికపై వాళ్ల వంశంలోకి ఆహ్వానిస్తారు. సాధారణంగా జాతర జనవరిలో జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మార్చిలో లేదా జాతర మరుసటిరోజు పెళ్లి చేసుకున్నా.. మెస్రం వంశంవాళ్లుగా గుర్తించడానికి నాగోబా జాతర వచ్చేవరకు వేచిచూడాల్సిందే. అప్పటివరకు కొత్తగా పెళ్లయిన మహిళలు నాగదేవుడిని చూడటం.. పూజించడం గానీ చేయరాదు. తెల్లని వస్త్రంతో ముఖం కనిపించకుండా ముసుగు ధరించాల్సి ఉంటుంది. నాగోబా జాతరలో మొదటిరోజు రాత్రి జరిగే మహాపూజ అనంతరం అల్లుళ్లతో పెళ్లి కూతురు ఇంటివారు పుట్ట మట్టిని నీళ్లుపోసి తొక్కిస్తారు. ఆ మట్టితో పెళ్లికూతురు పుట్టని అలికిస్తారు. ఆ తర్వాత నాగదేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం బేటింగ్ లో అందరికీ పరిచయం చేస్తారు. మెస్రం వంశీయులు అల్లుళకు పెద్దపీట వేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అల్లుళ్లకు పెళ్లికూతురు తరఫువారు నజరానాలు ఇస్తారు.
వంట వార్పు 22 పొయ్యిలే...
జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలమంది వచ్చినా 22 పొయ్యిల మీదనే వంట చేసుకోవాలి. ఎవరినచ్చినట్టుగా వాళ్లు పొయ్యిలు పెట్టడానికి మెస్రం వంశంలో అనుమతిలేదు. ఆలయ ప్రాంగణ ప్రహరి గోడను ఆనుకుని 22 పొయ్యిలు ఉంటాయి. మెస్రం వంశీయులు వంతుల వారిగా వాటిపైనే వంటలు చేసుకోవాల్సి ఉంటుంది. తరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ వాళ్లు పాటిస్తూనే ఉన్నారు.
జాతరలో ప్రత్యేక వాయిద్యాలు
డోలు
తుండుం
కాలికోం
పేప్రే