Diwali: చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన శివకాశి 'టపాసు' కథ

by karthikeya |   ( Updated:2024-11-02 13:37:47.0  )
Diwali: చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన శివకాశి టపాసు కథ
X

గుంటూరు మిర్చికి ఫేమస్..

నిజామాబాద్‌ పసుపుకు ఫేమస్..

పోచంపల్లి చేనేతకు ఫేమస్..

తిరుపతి వెంకన్నకు ఫేమస్..

కొండపల్లి బొమ్మలకు ఫేమస్..

హైదరాబద్ బిర్యానీకి ఫేమస్..

కానీ.. టపాసులకు ఫేమస్ అయిన ఊరి గురించి ఎప్పుడైనా విన్నారా..?

దీపావళి నాడు మనం కాల్చే కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, టపాసులు.. అబ్బో ఇలా ఒక్కటేంటి.. అన్నీ దాదాపు అక్కడే తయారవుతాయి. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఒక్కో ఊళ్లో ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. కానీ ఈ ఊళ్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఈ టపాసుల తయారీ వ్యాపారమే చేస్తారు. అంటే ఊరంతా ఒక్కటే వ్యాపారం అన్నమాట. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పలేదు కదూ! శివకాశి. -పోచరాజు కార్తికేయ

ఊరు ఊరంతా పరిశ్రమే..

దీపావళి పండుగ రోజున మనందరం టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటాం. అది మనందరికీ కొంతసేపు ఆనందాన్నిస్తే.. ఆ ఊరి వాళ్లకి మాత్రం అదే జీవనాధారం. మనం ఒక్కరోజు టపాసులు కాల్చడం కోసం ఇక్కడ ఏడాది పొడవునా కష్టపడతారు. దేశవ్యాప్తంగా పేల్చే టపాసుల్లో అత్యధిక శాతం ఆ ఊరిలో తయారైనవే. ఆ ఊరి పేరు శివకాశి. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఉంటుందీ ప్రాంతం. ఇక్కడ ఊళ్లో పరిశ్రమ ఉండటం కాదు.. ఊరు ఊరంతా పరిశ్రమగా మారి టపాసులను తయారు చేస్తుంటారు.

శివకాశి చరిత్ర:

శివకాశి బాణసంచాకు వందేళ్లపైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలు కలకత్తాలో ఉండేవి. అగ్గిపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీలే ఈ టపాసులను కూడా తయారు చేసేవి. 1908లో శివకాశిలో నివశించే పి. అయ్య నాడార్ సోదరుడు శముంగ నాడార్ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ కలకత్తా వెళ్లి అక్కడ ఓ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పని చేయడం ప్రారంభించారు. అక్కడ 8 నెలల పాటు పని నేర్చుకుని తమిళనాడుకు తిరిగొచ్చిన శముంగ నాడార్.. అక్కడ అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేర్లతో అగ్గిపెట్టెల తయారీ ప్రారంభించారు. దానికోసం జర్మనీ నుంచి యంత్రాలను తెప్పించాడు. ఆ తర్వాత అదే బ్రాండ్ పేరుతో టపాసుల కంపెనీ స్టార్ట్ చేశాడు. 30 మందితో చిన్నపాటి బాణసంచా తయారీ కుటీర పరిశ్రమను ఏర్పాటైన ఈ పరిశ్రమ రెండేళ్లలో 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. అది చూసి కొందరు ఇదే వ్యాపారం మొదలు పెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలుగా మారి మొత్తం దేశానికే బాణసంచా రాజధానిగా శివకాశి మారిపోయింది.

శివకాశి ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి ‘టపాసు’

శివకాశి కేవలం బాణసంచా పరిశ్రమగా మారడం వెనుక ఓ హృదయవిదారకమైన కథ కూడా ఉంది. నిజానికి శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు లేవు. సారవంతమైన భూమి తక్కువ. భూమిలో రసాయనాలు కలుస్తుండడంతో వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి. నదులు, సాగునీరు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఈ ప్రాంతాన్ని వదిలి వలసలు పోతూ ఉండేవారు. కొంతమంది చేతి వృత్తులు, ఉపాధి పనులమీద ఆధారపడినా అంతగా వారి జీవితం బాగుపడలేదు. ఆ సమయంలో శముంగ నాడార్ టపాసుల ఫ్యాక్టరీతో ఓ కొత్త వెలుగు కనపడింది. అలా చీకటిలో ఉన్న వారి జీవితాల్లో ఈ టపాసులు నిజమైన వెలుగులు తీసుకొచ్చాయి.

పేరు వెనుక కథ :

శివకాశి ఊరికి ఆ పేరు చాలా విచిత్రంగా వచ్చింది. స్థానికులు చెప్పేదేంటంటే.. ఒకానొకప్పుడు కొందరు భక్తులు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని కన్యాకుమారిలో ప్రతిష్ఠించాలని అనుకున్నారట. అలా వస్తూ వస్తూ ఒకరాత్రి ఇప్పటి శివకాశి ప్రాంతంలో బస చేశారట. మర్నాటికి లింగం అక్కడే పాతుకుపోయిందట. ఎంత ప్రయత్నించినా లింగం బయటకు రాకపోవడంతో లింగం ఉన్న చోటే ఆలయాన్ని కట్టి పూజలు చేయడం ప్రారంభించారు. కాశీ నుంచి వచ్చిన శివలింగం ప్రతిష్ఠించబడిన ప్రాంతం కావడంతో అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని శివన్‌ కాశి అని పిలిచేవారట. ఆ పేరు వాడుకలో శివకాశిగా మారిపోయిందనేది స్థానికుల మాట. అంతేకాదు ఆ ఆలయం ఇక్కడ ఇప్పటికీ ఉంది.

టపాసుల పరిశ్రమగా లక్షల మందికి జీవనాధారం:

శివకాశి ప్రాంతంలో ప్రస్తుతం చిన్నవి, పెద్దవి అన్ని కలిసి దాదాపు 8,000 బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాయి ఇక్కడి పరిశ్రమలు. ఇక్కడ ఏడాది పొడవునా అంటే 365 రోజులూ టపాసుల తయారీ సాగుతూ ఉంటుంది. ఈ పరిశ్రమ ద్వారా శివకాశిలో దాదాపు 8 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారట. దాదాపు 3 లక్షల మంది బాణసంచా తయారీలో, మరో 2 లక్షల మంది ఇళ్లలోనే టపాసుల ప్యాకింగ్‌లో, మార్కెటింగ్‌ - క్రయవిక్రయ విభాగాల్లో మరో 3 లక్షల మందికి ఈ బాణసంచా పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడినుంచి విదేశాలకు కూడా బాణసంచా ఎగుమతి అవుతుంటుంది.

ఎలా తయారు చేస్తారు..?

బేరియం, నైట్రేట్‌, ఫాస్ఫేట్‌, అల్యూమినియం పొడి, గంధకం, బూడిద, పాస్ఫరస్‌ లాంటి సెన్సిటివ్ కెమికల్స్ ఈ బాణసంచా తయారీలో వాడతారు. ఈ కెమికల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా కలిసి టపాసులను తయారు చేస్తారు. అయితే వీటని అంత ఈజీగా కొనడం అందరికీ సాధ్యం కాదు. రిజిస్టర్డ్ సంస్థలు మాత్రమే ఈ కెమికల్స్ కొనేందుకు అనుమతి ఉంది. ఇక టపాసుల వ్యాపారం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అదే ఒకవేళ పెద్ద పరిశ్రమగా ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అప్రూవల్ పొందాలి. అలా కాకుండా అనుమతులు లేకుండా ఎవరైనా టపాసులు తయారు చేస్తే అది చట్టాన్ని అతిక్రమించినట్లే.

కాలుష్యంతో కుదేలైన బిజినెస్:

గత 8 ఏళ్లలో శివకాశి లాంటి బాణసంచా తయారీ సంస్థలు చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. అందులో ముఖ్యంగా కాలుష్యం పెరిగిపోతోందనే కారణంతో ఢిల్లీ లాంటి 200 ఏక్యూఐ దాటిన అనేక నగరాల్లో బాణసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించడం.. టపాసుల తయారీలో కీలకమైన యాంటిమొని, లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, బేరియం సాల్ట్స్ వంటి హానికర కెమికల్స్‌ వాడకాన్ని బ్యాన్ చేసిన సుప్రీం కోర్టు.. అల్యుమినియం, సల్ఫర్, పొటాషియం, బేరియం వంటి కెమికల్స్‌తో మాత్రమే క్రాకర్స్ తయారు చేయాలని తీర్పు నిచ్చింది. నిషేధిత కెమికల్స్‌తో ఎవరైనా టపాసులు తయారు చేస్తే ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. అలాగే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI), ది పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) పేర్కొన్న విధంగా గ్రీన్ క్రాకర్స్‌నే తయారు చేయాలని పేర్కొంది. ఈ తీర్పుతో బాణసంచా పరిశ్రమ కుదేలైందనేది నిర్వాహకుల మాట.

చైనా టపాసుల దెబ్బ..

ప్రపంచం మొత్తంలో టపాసులు తయారు చేసే దేశాలు దాదాపు రెండే. అవి భారత్, చైనా. అయితే మన దేశంలో 90 శాతం మార్కెట్ శివకాశి చేతుల్లో ఉంటే.. 10 శాతం మాత్రమే చైనా చేతిలో ఉంది. కానీ ప్రపంచ మార్కెట్లో ఈ సీన్ మారిపోతుంది. వరల్డ్ మార్కెట్లో 90 శాతం టపాసుల మార్కెట్ చైనా గుప్పిట్లో ఉంది. ఈ మార్కెట్‌లో వాటా కోసం శివకాశి కూడా బలంగా ట్రై చేస్తోంది. ఇదే చైనాకు మంట. అందుకే శివకాశిని దెబ్బకొట్టడానికి భారతదేశంలోకి తక్కువ ధర పలికే టపాసులను అక్రమంగా తరలించి విక్రయిస్తోంది. దీనివల్ల ధర ఎక్కువగా ఉండే నాణ్యమైన టపాసుల డిమాండ్ పడిపోయింది. దీంతో శివకాశిలో టపాసుల పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలకు బాణసంచా తయారీకి దూరం అవుతుండడంతో ఉత్పిత్తి కూడా 40 శాతానికి పైగా పడిపోయింది.

చైనా దొంగచాటు వ్యాపారంతో నష్టాల్లోకి..

2009లో విదేశాల నుంచి టపాసుల దిగుమతులపై కేంద్రం నిషేధం విధించినా.. అది పెద్దగా పనిచేలేదు. చైనా అక్రమంగా ఈ టపాసులను మార్కెట్లోకి పంపిస్తూనే ఉంది. ఒకప్పుడు కేవలం రూ.2 కోట్ల రూపాయల మార్కెట్‌గా ఉన్న ఈ చైనా టపాసుల దిగుమతులు ఇప్పుడు ఏకంగా రూ.250 కోట్లు దాటేశాయంటే ఏ స్థాయిలో అక్రమ దిగుమతులు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. దానికి తోడు ఈ చైనా టపాసులు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తుండడంతో వీటికి NEERI, PESO వంటి ప్రభుత్వ రంగ సంస్థల నిబంధనలు కూడా వర్తించవు. దానివల్ల హానికరమైన చీప్ కెమికల్స్‌తో చైనా ఈ టపాసులను తయారు చేసి భారత్‌కి తరలిస్తోంది. ప్రజలు కూడా ధర తక్కువగా వస్తుండడంతో వాటికే మొగ్గు చూపుతున్నారు.

మీ కోసం ఇంకో మాట..

ఇది శివకాశి టపాసుల స్టోరీ. మరి మీరు కాల్చే బాణసంచా కథ, దాని వెనకున్న లక్షల మంది జీవితాల కథ తెలిసింది కదా. వాళ్లంత కష్టపడుతుంటే మనం కూడా వాళ్లకి సపోర్ట్‌గా చైనా క్రాకర్స్ కాల్చకుండా మన ఇండియన్ పటాకులనే పేల్చి ఈ దీపావళి జరుపుకుందాం. ఏమంటారు..? హ్యాపీ దీపావళి.

శివకాశి 'టపాసు' కథ

Advertisement

Next Story