- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా బిజినెస్.. ఎన్‌ఎఫ్‌టీల ద్వారా భారీ ఆదాయం
దిశ, ఫీచర్స్: ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ నుంచి మోనాలిసాను కొనుగోలు చేశారా? రవీంద్రనాథ్ ఠాగూర్ సంతకం చేసిన కాపీని మీకు ఇచ్చారా? లేదా మీ అభిమాన స్టార్.. ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా అందించిన ఫోటో కలిగి ఉన్నారా? ఇంకేదైనా అరుదైన పెయింటింగ్ మీ దగ్గరా ఉందా? అయితే వాటిని విలువైన ఆస్తులుగా మార్చుకునే అవకాశం ఉంది. సరదాగా తీసిన వీడియోకు లక్షల రూపాయల ధర పలికించే టెక్నిక్ ఉంది. ప్రస్తుతం నవ్వులు పుట్టించే ‘మీమ్’ కూడా మీ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకురావచ్చు. ఇందులో భాగంగానే 160 అక్షరాలతో కూడిన ట్వీట్.. తాజాగా రూ.21 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఆశ్చర్యకర ఫలితాలకు సమాధానమే బ్లాక్‌చెయిన్ ఆధారిత నాన్-ఫంజిబుల్ టోకెన్స్(ఎన్‌ఎఫ్‌టీ). క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. సాధారణ వ్యక్తులను హఠాత్తుగా కరోడ్‌పతులను చేస్తున్న ఎన్‌ఎఫ్‌టీలపై స్పెషల్ స్టోరీ..
డిజిటల్ ప్రపంచంలో ‘డిజిటల్ అసెట్’ను కాపీ చేయడం లేదా వందల సంఖ్యలో డూప్లికేట్స్‌ను సృష్టించడం తేలిక. కానీ ఒరిజినల్ మాత్రం ఒక్కరికే సొంతం. అయితే మీ దగ్గర ఒరిజినల్ ఉన్నప్పటికీ, దాన్ని నిర్దారించే ప్రూఫ్స్ కూడా ఉండాలి. అందుకే అపురూప, అద్వితీయమైన క్లాసిక్ ప్రొడక్ట్స్‌పై ‘ఎక్స్‌క్లూజివ్ ఓనర్‌షిప్’ పొందడం సవాలుతో కూడుకున్న పని. దానికి పరిష్కారమే బ్లాక్‌చెయిన్ ఆధారిత నాన్-ఫంజిబుల్ టోకెన్స్(ఎన్‌ఎఫ్‌టీ). సింపుల్‌గా చెప్పాలంటే ఒరిజినల్ క్రియేషన్స్‌పై యాజమాన్య హక్కును ధృవీకరించే డిజిటల్ సర్టిఫికెట్. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌లో నమోదయ్యే ప్రతీ వస్తువు దేనికదే ప్రత్యేకమైంది. చిత్రాలు, పెయింటింగ్స్, ఆర్ట్స్‌కు మాత్రమే ఎన్‌ఎఫ్‌టీ పరిమితం కాలేదు. మీమ్స్, సాంగ్స్, ఫొటోస్, ట్వీట్స్, జిఫ్, మ్యూజిక్, వీడియోలతో పాటు వీడియో గేమ్స్‌లోని ఇన్-గేమ్ ఐటెమ్స్‌ను కూడా డిజిటల్ ఆస్తులుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు కళాకారులు తమ డిజిటల్ ఆర్ట్ వర్క్స్‌ను విక్రయించడానికి ఎన్‌ఎఫ్‌టీని ఉపయోగిస్తే, సంగీతకారులు రాయల్టీలను నిలుపుకోవడానికి వినియోగించుకుంటారు. ఎన్‌ఎఫ్‌టీలను సాధారణంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ విలువతో విక్రయిస్తారు. కాగా బ్లాక్ చైన్ లావాదేవీల రికార్డ్‌ను భద్రపరుస్తుంది.
నయా బిజినెస్
కళలు, సంగీత ప్రపంచానికి సంబంధించిన సరికొత్త వ్యాపారానికి ఎన్‌ఎఫ్‌టీలు అవకాశాలను సృష్టించాయి. దాంతో స్క్రిప్ట్ రచయితలు వారి రైటింగ్స్‌కు ఎన్‌ఎఫ్‌టీలను సృష్టిస్తుండగా.. గ్రాఫిక్ డిజైనర్లు వారి పోస్టర్లను, మ్యూజిషియన్స్ తమ ట్యూన్స్‌ను డిజిటల్ ఆస్తులుగా మార్చుకుంటున్నారు. తమ ఒరిజినల్ ప్రొడక్ట్ విక్రయించాలనుకునే కళాకారులు లేదా సాధారణ ప్రజలు.. వాటిని ఓపెన్‌సీ(OpenSea), సెంట్(Cent), వజీర్ ఎక్స్(WazirX), ఫౌండేషన్ (Foundation) వంటి ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఫౌండేషన్ అనేది ‘ఇన్విటేషన్ ప్లాట్‌ఫామ్’. ఎవరైనా ఫౌండేషన్ సభ్యులు మనల్ని ఇన్వైట్ చేస్తేనే అందులో మన ప్రొడక్ట్‌ను అమ్మే అవకాశం లభిస్తుంది. ఎన్‌ఎఫ్‌టీని రియల్ మనీగా మార్చుకునే అవకాశమూ ఉండగా.. అందుకోసం యజమాని దానిని క్యాష్ చేయడానికి ముందుగా క్రిప్టో కరెన్సీలో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఆర్ట్ వరల్డ్‌లో తమ కళాత్మకమైన ప్రొడక్ట్స్ కొనుగోలు, భద్రపరచడంతో పాటు పెట్టుబడి మార్గానికి ఇది అద్భుతమైన మార్గంగా ఆయా కళాకారులు భావిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ వారికి నేరుగా కలెక్టర్లతో సంభాషించే స్వేచ్ఛను కూడా కల్పించింది. ఇక్కడ ఆర్టిస్ట్.. తన వర్క్ అప్‌లోడ్ చేయడానికి ‘గ్యాస్ ఫీజు’ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రుసుము డిజిటల్ కరెన్సీల మార్కెట్ విలువను బట్టి మారుతుంది. ఇక ఎన్‌ఎఫ్‌టీలో మరో గొప్ప విషయం ఏమిటంటే.. కళాకృతి ద్వితీయ విక్రయాల నుంచి సైతం రాయల్టీలను పొందొచ్చు. సాంప్రదాయ కళా రంగానికి సంబంధించి సెకండరీ మార్కెట్‌లో ఆర్ట్ వర్క్‌ను విక్రయిస్తే, సాధారణంగా కళాకారుడికి రాయల్టీలు అందవు, కానీ ఇక్కడ పొందే అవకాశం ఉంది.
ఆ కళలకు కనకవర్షం
ఫేమస్ డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్.. దాదాపు 5 వేల రోజులుగా ప్రతీరోజు తను క్రియేట్ చేసిన ఆర్ట్స్‌తో ఓ కొలాగ్ సృష్టించాడు. అదే ‘ఎవ్రీడేస్-ద ఫస్ట్ 5000 డేస్’. దీన్ని ఇటీవలే వేలం వేయగా ఏకంగా 6.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.501 కోట్లు) దక్కాయి. దీంతో బీపుల్ అత్యంత విలువైన ఆర్టిస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు అతడి ఫొటోను తను కూడా కాపీ చేయడం అసాధ్యం. ఎందుకంటే దాన్ని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో భద్రపరిచారు. అయితే కళాకారుడు ఇప్పటికీ భౌతిక కళాకృతి వలె.. కాపీరైట్, రీప్రొడక్షన్ హక్కులను కలిగి ఉంటాడు. అదేవిధంగా ఒరిజినల్‌ను ఒక్కరు మాత్రమే సొంతం చేసుకోవచ్చు.
6 మిలియన్స్
టెక్ మొఘల్ ఎలన్ మస్క్ ప్రియురాలైన కెనడియన్ ఆర్టిస్ట్ గ్రిమ్స్.. ఈ ఏడాది ప్రారంభంలో 10 పెయింటింగ్స్‌ను ఎన్‌ఎఫ్‌టీలుగా మార్చి 6 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఈ ఫాంటసీ చిత్రం.. భూమి, అంగారక గ్రహం, డెత్ ఆఫ్ ఓల్డ్ అనే శీర్షికలను కలిగి ఉంటుంది.
న్యాన్ క్యాట్ : (Nyan Cat)
ఈ ప్రసిద్ధ జిఫ్, 2010 ప్రారంభంలో ప్రజాదరణ పొందింది. కళాకారుడు క్రిస్ టోరెస్.. క్రిప్టో ఆర్ట్ ప్లాట్‌ఫామ్ ‘ఫౌండేషన్’ ద్వారా దీన్ని విక్రయించగా300 ETH (సుమారు $ 5,90,000)కు అమ్ముడుపోయింది. చరిత్రలో ఎన్‌ఎఫ్‌టీ ద్వారా డబ్బు ఆర్జించిన మొదటి మీమ్ ఇదే కావడం విశేషం.
ఫస్ట్ ట్వీట్
ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సె తన మొట్టమొదటి ట్వీట్(నా ట్విట్టర్‌ను సెటప్ చేయండి)ను ఎన్ఎఫ్‌టీగా వేలం వేయగా (sic) $ 29,15,835కు అమ్ముడుపోయింది. డోర్సె ఈ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వగా.. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 21 కోట్ల పైమాటే.
దురదృష్టకర సందర్భాలను సూచించే ‘బ్యాడ్ లక్ బ్రియాన్’ మీమ్.. ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 36 వేల డాలర్లకు అమ్ముడుపోగా, సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సక్సెస్ కిడ్ ఫొటో గుర్తుండే ఉంటుంది. దీన్ని ఇమ్మిగ్రేషన్ సంస్కరణను ప్రోత్సహించడానికి వైట్ హౌస్ కూడా ఉపయోగించుకుంది. ఇథీరియం క్రిప్టోకరెన్సీలో దాదాపు 32,355 డాలర్లకు అమ్ముడుపోయింది. చార్లీ బిట్ మై ఫింగర్ అనే వైరల్ వీడియోను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇది ఎన్‌ఎఫ్‌టీ వేలంలో 7,60,999 డాలర్లకు అమ్ముడైంది. బీపిల్, గ్రిమ్స్, డోర్సెలానే తదితర కళాకారులు.. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చైన్‌ను ఉపయోగించి ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులను సృష్టించే ఈ కొత్త టెక్నాలజీతో తమ ఆర్ట్ వర్క్స్ విక్రయించి భారీగా ఆర్జిస్తున్నారు.
భారత్‌లో
ఇండియాలో ‘వజీర్ ఎక్స్ మార్కెట్ ప్లేస్’ ఎన్ఎఫ్‌టీ ఆస్తుల కొనుగోలు, విక్రయాలను సులభతరం చేస్తోంది. ఎన్‌ఎఫ్‌టీలను కొనడానికి లేదా విక్రయించడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు చేయాల్సిందల్లా ‘మెటామాస్క్ లేదా బినాన్స్ వాలెట్’ ఐడీకి లింక్ చేసిన ‘వజీర్‌ఎక్స్’లో ఖాతాను సృష్టించాలి. వజీర్ మార్కెట్‌ప్లేస్‌లో ఇప్పటి వరకు $ 70,000 అమ్మకాలు ఉన్నాయి. బెంగళూరు ఆర్టిస్ రాఘవ కెకె 2000 సంవత్సరం ప్రారంభం నుంచి తన డిజిటల్ కళతో అంతర్జాతీయ మార్కెట్‌లో సంచలనం రేపాడు. అతడి ఎన్‌ఎఫ్‌టీ ఆర్ట్ వర్క్స్‌కు ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. వజీర్‌ఎక్స్ ఎన్‌ఎఫ్‌టి మార్కెట్‌ప్లేస్‌లో ప్రముఖ సృష్టికర్తలలో చెన్నైకి చెందిన 13 ఏళ్ల యువ కళాకారిణి లయ మథిక్షర ఉంది. జిఫ్‌లు సృష్టించే ప్రముఖ కళాకారుడు ప్రసాద్ భట్,మల్టీ-ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ లిడియాన్ నాదస్వరం, కవి ప్రియా మాలిక్, విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా, ముంబైకి చెందిన సంగీతకారుడు-కళాకారుడు సంబిత్ ఛటర్జీ, కళాకారుడు పండిట్ సుభేన్ ఛటర్జీలు కూడా వజీర్‌లో ఉన్నారు.
‘ఒక ఆర్టిస్ట్‌గా, మీ విలువ ఇంత త్వరగా ఆకాశాన్నంటుతుంటే.. మళ్లీ అంతే వేగంగా పడిపోతుందా! అని నేను ఆందోళన చెందుతాను. ఎందుకంటే ఈ డిజిటల్ విప్లవం సృజనాత్మక రంగాన్ని నిజంగా ప్రజాస్వామ్యం చేస్తుందా? లేదా చివరకు పెట్టుబడిదారులు, ఉన్నతవర్గాల చేతుల్లోకే వెళ్తుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఈ అమ్మకాలన్నింటిలో హైప్‌కు విరుద్ధంగా మీ పని.. మీరు అందించిన విలువపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ప్రత్యేకమైనదాన్ని సృష్టించగలిగితే చాలు’ – ఫోటో ఆర్టిస్ట్ శిబు అరక్కల్