దమ్మాయిగూడలో బిగ్ స్కాం.. రూ.కోట్లు విలువ చేసే భూమి హాంఫట్

by Shyam |   ( Updated:2021-11-23 04:11:42.0  )
dammaiguda lands
X

దిశ, జవహర్ నగర్: ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. మున్సిపాలిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడలేని పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం ఉండగా, అడ్డూ అదుపులేని ఆక్రమణదారులు నిరభ్యంతరంగా కబ్జాలు చేసేస్తున్నారు.

దమ్మాయిగూడ మున్సిపాలిటీ, అహ్మద్ గూడ రెవెన్యూ శివారులో ఉన్న సర్వే నంబర్‌ 51లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ భూమి కావడంతో ఈ సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న ప్రైవేట్ పట్టాదారులు గవర్నమెంట్‌ హద్దులను తొలగించి యధేచ్చగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ప్రైవేట్‌ సర్వే నంబర్ల పేరుతో పాటుగా ప్రభుత్వ భూములను (సర్వే నం.51) ఆక్రమణదారులు అమ్ముకుంటున్నారు. 51 సర్వే నంబర్‌లో రెండెకరాల ఒక గుంట మేర కబ్జాకు లోనవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కలెక్టరేట్ లో ఫిర్యాదు..

దమ్మాయిగూడ మున్సిపాలిటీ, అహ్మద్ గూడ రెవెన్యూ శివారులో ఉన్న సర్వే నంబర్‌ 51లో ప్రభుత్వ భూమి ఉంది. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల ఉన్న పట్టాదారు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన నిర్ధిష్టమైన హద్దులను తొలగించి అదనంగా భూమిని కలుపుకుంటూ అక్రమ లే అవుట్ చేస్తూ ప్రజలకు విక్రయిస్తున్నారు. ఒకవైపు ఈ పరిస్థితి ఉంటే మరోవైపు సమీపంలోని పట్టా భూముల పేరుతో కొందరు ఆక్రమణలు చేస్తున్నారని, వాటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడాలంటూ స్థానికులు ఎమ్మార్వోలకు, ఆర్డీవోలకు పలుమార్లు విన్నవించారు. చివరకు కలెక్టర్‌కు సైతం సోమవారం ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఫిర్యాదు మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇకనైనా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని స్థానికులు వేడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed