వైట్‌హౌజ్‌లో.. ప్రెసిడెన్షియల్ పెట్స్

by Shyam |
వైట్‌హౌజ్‌లో.. ప్రెసిడెన్షియల్ పెట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ మరికొన్ని రోజుల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నాడు. అయితే 100 సంవత్సరాల వైట్‌హౌజ్‌ చరిత్రలో పెంపుడు జంతువు లేని ఏకైక ప్రెసిడెంట్‌గా ట్రంప్ నిలిచిపోయాడు. కాగా ప్రస్తుతం జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో.. ప్రెసిడెన్షియల్ పెట్స్ సంప్రదాయం మళ్లీ కొనసాగనుంది.

జో బైడెన్.. మళ్లీ ప్రెసిడెన్షియల్ పెట్ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. జనవరిలో బైడెన్ పెంపుడు శునకాలైన ‘చాంప్, మేజర్’ అనే జర్మన్ షెపర్డ్స్ డాగ్స్ మళ్లీ వైట్‌హౌజ్‌లో తిరుగాడబోతున్నాయి. 2008లో బైడెన్ తొలిసారి జర్మన్ షెపర్డ్ శునకాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. దానికి ‘చాంప్’ అనే పేరును పెట్టుకున్నాడు. ఆ పేరు కూడా ఏదో ఆషామాషీగా పెట్టలేదు. బైడెన్ చిన్న వయసులో ఉండగా ఆయన తండ్రి ‘గెటప్.. చాంప్’ అని అంటుండేవారట. అందుకే ఆ పదాల్లోని ‘చాంప్’ను తనకు ఇష్టమైన శునకానికి పెట్టుకున్నాడు. ఇక మరో శునకాన్ని షెల్టర్ హౌజ్ నుంచి దత్తత తీసుకున్నాడు. దానికి ‘మేజర్’ అని పేరు పెట్టాడు.

బరాక్ ఒబామా కూడా.. ‘బో, సన్నీ’ అనే రెండు పెంపుడు శునకాలను పెంచుకున్నాడు. 8 సంవత్సరాల పాటు అవి వైట్‌హౌజ్‌లో తిరుగాడాయి. జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్‌సన్, జేమ్స్ మాడిసన్ నుంచి మొన్నటి జార్జ్ హెచ్ డబ్లూ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా వరకు 45 మంది అధ్యక్షుల్లో 43 మంది పెంపుడు జంతువులను పెంచుకున్నారు. ప్రెసిడెన్షియల్ హౌజ్‌లో వాటితో ఆడుకున్నారు.

Advertisement

Next Story