- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ యూటర్న్.. భద్రాద్రి వాసులకు చుక్కెదురు
దిశ, భద్రాచలం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన 14వ తేదీ ఆదివారం తిరుపతిలో జరుగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదనే పిడుగులాంటి వార్త భద్రాద్రి వాసులను తీవ్ర నిరాశపర్చింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరైతే ఐదు ముంపులేని గ్రామాల సమస్య పరిష్కారం అవుతుందని భద్రాచలం ప్రాంత ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ సమావేశానికి సీఎం వెళ్ళడం లేదని తెలిసి నిరాశ, నిస్పృహలకు గురౌతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం పట్టణంతో కలిసి ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలకు కనీసం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం లేనప్పటికీ.. ముంపు ప్రాంతాలతో కలిపి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. అప్పటి కేంద్ర, ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి హడావుడిగా తీసుకున్న ఈ నిర్ణయం వలన భద్రాచలం ప్రాంత ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు.
భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్ళడానికి సుమారు 10 కి.మీ దూరం ఆంధ్రా(ఎటపాక మండలం) మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, తదితర శాఖలకు సంబంధించి సమస్యలు రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములు సుమారు 1000 ఎకరాలకుపైగా గుండాల, పురుషోత్తమపట్నం ప్రాంతంలో ఉన్నాయి. దీంతో దేవస్థానం వారికి కూడా అనేక ఇబ్బందులు లేకపోలేదు. ముంపు ప్రభావంలేని ఈ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో (భద్రాచలం)కలపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించగా.. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, కేంద్రం, ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇలాంటి అంతరాష్ట్ర సమస్యల పరిష్కార వేదికగా జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ నందు సీఎం కేసీఆర్ తన వాగ్దాటితో ఈ ఐదు గ్రామాల సమస్యను ప్రస్తావించి తిరిగి సాధిస్తారని భద్రాద్రివాసులు ఆశపడ్డారు. అయితే జోనల్ సమావేశానికి సీఎం వెళ్ళడం లేదని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం హాజరుగాకుంటే ఈ ప్రధానమైన సమస్య చర్చకువస్తుందా? అనే అనుమానాలు భద్రాద్రి ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. జోనల్ కౌన్సిల్‌లో ఈ సమస్యకు పరిష్కారం లభించకుంటే ఇక ఇప్పట్లో పరిష్కారం కష్టమనే భావన ప్రజల్లో వ్యక్తమౌతోంది.