సీఎంగా మమత ప్రమాణం.. అంతలోనే సంచలన నిర్ణయం

by Shamantha N |   ( Updated:2021-05-05 04:57:39.0  )
సీఎంగా మమత ప్రమాణం.. అంతలోనే సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని కమలనాధులు ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, వారి అంచనాలను తలకిందులు చేస్తూ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగాల్ ఓటర్లు చాలా స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టడంతో వంగ భూమిలో దీదీ హవా ముందు బీజేపీ తలొగ్గక తప్పలేదు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సంచలనానికి తెరలేపారు. ప్రస్తుతం ఉన్న డీజీపీ నీరజ్ నయాన్‌పై బదిలీ వేటు వేశారు.

గతంలో సీఎం మమత నియమించిన డీజీపీకే మళ్లీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ నిర్వహిస్తు్న్న మమతపై దాడి జరిగిన ఘటనలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. దానికి బాధ్యుడిని చేస్తూ నాటి డీజీపీ వీరేంద్రను తక్షణమే బదిలీ చేస్తూ నీరజ్ నయాన్‌కు బాధ్యతలు అప్పగించింది. తిరిగి బెంగాల్లో మమత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే వీరేంద్రకు డీజీపీగా అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story