సాయంపై సన్నగిల్లుతున్న ఆశలు

by Shyam |   ( Updated:2020-05-11 09:38:57.0  )
సాయంపై సన్నగిల్లుతున్న ఆశలు
X

దిశ, హైదరాబాద్: కరోనా ఆపత్కాలంలో పేదలకు ఉపాధి కరువై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం 12 కిలోల బియ్యం, రూ.1500 సాయం ప్రకటించింది. వీటిని రేషన్ కార్డు ఉన్న అందరికీ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆ డబ్బులను లబ్ధిదారులకు ఖాతాలో వేసినట్టు ప్రకటించింది. కానీ చాలా మందికి డబ్బులు వారి ఖాతాలో జమకాలేదు. దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నందున లబ్ధిదారులకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు. హైదరాబాద్ నగరం రెడ్‌‌జోన్ కావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఆఫీస్‌‌కు వచ్చే కొద్ది సిబ్బంది సైతం దాదాపుగా కరోనా విధుల్లోనే ఉంటున్నట్టు చెబుతున్నారు. డబ్బులు రాని లబ్ధిదారులు సికింద్రాబాద్ లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయానికి, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ రోజూ తిరుగుతున్నారు. ఈ సమయంలో కార్యాలయాల్లో ఉన్నత అధికారులు ఉండడం లేదు. హైదరాబాద్ జిల్లాలో పౌరసరఫరాల శాఖలోని 9 సర్కిళ్ల పరిధిలో మొత్తం 674 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5లక్షలా 80 వేలా 747 రేషన్ కార్డుదారులున్నారు. ఎంత మందికి డబ్బులు జమయ్యాయనే సమాచారం అడగ్గా తమ వద్ద సమాచారం లేదంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు.

ఆధార్ లింక్ ఉంటేనే – పద్మ, హైదరాబాద్ డీఎస్ఓ

బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారికి మాత్రమే డబ్బులు రావడం లేదు. అలాంటి వారు వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసుకోవాలి. ఇప్పటివరకూ ఎంత మందికి డబ్బులు అందాయో మా వద్ద సమాచారం లేదు. ఆధార్ లింక్ చేసుకున్న వారికి ఇలాంటి సమస్యలు లేవు.

Advertisement

Next Story