చైనా కవ్విస్తే కఠినంగా వ్యవహరించండి.. సైన్యానికి పూర్తి స్తేచ్ఛ

by Shamantha N |
చైనా కవ్విస్తే కఠినంగా వ్యవహరించండి.. సైన్యానికి పూర్తి స్తేచ్ఛ
X

న్యూఢిల్లీ: ఎల్ఏసీలో చైనా ఆర్మీ దూకుడుగా వ్యవహరిస్తే తిప్పికొట్టేందుకు సరిహద్దులో మోహరించి ఉన్న భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు తెలిసింది. తూర్పు లడాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి మిలిటరీ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కొన్నివర్గాలు ఈ మేరకు సమాచారాన్ని ఇచ్చాయి. ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, నేవీ చీఫ్ అడ్మైరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బధౌరియాలు హాజరయ్యారు. భూ, సముద్ర సరిహద్దులు, గగనతల పరిధిలో చైనా కార్యకలాపాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి సూచించినట్టు తెలిపాయి. చైనా దళాలు కవ్వింపుచర్యలకు దిగినా, సరిహద్దులు దాటినా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు వివరించాయి. జూన్ 15న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించాక భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులు దిగజారిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా గాల్వన్ లోయపై డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆకస్మికంగా ఏవైనా ఘటనలు చోటుచేసుకుంటే ఎదుర్కొనేందుకు ఆర్మీ, వైమానిక దళాలు సిద్ధమయ్యాయి.

Advertisement

Next Story