మహిళా కూలీలపై అత్యాచారం.. ప్రియుడికి ప్రియురాలి సాయం..!

by Anukaran |   ( Updated:2021-07-29 07:19:10.0  )
మహిళా కూలీలపై అత్యాచారం.. ప్రియుడికి ప్రియురాలి సాయం..!
X

దిశ, కుత్బుల్లాపూర్: ‘అడ్డా’ మీద మహిళా కూలీలను టార్గెట్‌ చేసిన ఓ జంట దారుణాలకు ఒడిగట్టారు. పని ఉందని చెప్పి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఇదే విషయంపై గురువారం డీసీపీ పద్మజ.. పోలీసుల విచారణలో వెలుగుచూసిన సంచలన విషయాలు చెప్పారు.

డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం..

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం జనగాంకు చెందిన కురువ స్వామి(30).. సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. ఇదే సమయంలో కోటపల్లి మండలం ఓబులాపురానికి చెందిన నర్సమ్మ(30)తో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరు సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని వైఎస్సార్‌ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. కురువస్వామికి తోడుగా నర్సమ్మ కూడా ఈజీ మనీపై కన్నేసింది.

ఈ నేపథ్యంలోనే మల్లంపేట కూలీల అడ్డాను టార్గెట్‌ చేశారు. జూన్ 25న అడ్డా మీదకు వెళ్లి పని ఉందంటూ ఓ మహిళా కూలీకి మాయమాటలు చెప్పి.. బైక్‌పై తీసుకెళ్లారు. అనంతరం మల్లంపేటలోని ఎంకిరాల గుట్టవైపు ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దాడి చేశారు. బాధిత మహిళ కూలీని నర్సమ్మ గట్టిగా పట్టుకోగా.. కురువ స్వామి అత్యాచారం చేశాడు. ఇదే సమయంలో కూలీ ఒంటి మీద ఉన్న నగలు, మొబైల్‌ను దొంగిలించారు. జరిగిన విషయాన్ని బాధితురాలు బయట చెప్పుతోందన్న భయంతో ఆమె ప్రైవేట్ భాగాల్లో కర్రలను దూర్చి నరకం చూపించారు. ఆ తర్వాత హత్య చేశారు.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

ఈ నెల 25న మహిళా కూలీ మిస్సింగ్ వ్యవహారం మల్లంపేటలో కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 25వ తేదీన కురువ స్వామి, నర్సమ్మలు ఇద్దరూ కలిసి మహిళా కూలీని బైక్‌పై తీసుకెళ్లినట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. జూలై నెలలోనే మరో ముగ్గురు కూలీలను ఇలాగే తీసుకెళ్లి అత్యాచారం చేశామని కురువస్వామి, నర్సమ్మలు ఒప్పుకున్నారు. వారి ఒంటి మీద నగలతో పాటు డబ్బులు, సెల్‌ఫోన్‌లను లాక్కున్నామని.. కానీ, హత్య చేయకుండా వదిలివేశామని అసలు విషయం చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకొని.. ఇంకా ఏమైనా కేసుల్లో ఈ జంట ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని డీసీపీ పద్మజ వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు రిమాండ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story