- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీరు సేల్స్‌పై ‘బార్ల’ ఎఫెక్ట్
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా వ్యాప్తి స్టార్టైనప్పటి నుంచి బార్లు, పబ్బులు మూసి వేయడంతో ఆ ఎఫెక్ట్ మెల్లగా బీర్లు తయారు చేసే కంపెనీలపై పడుతోంది. రాష్ట్రంలో 1000కి పైగా బార్లను, 100 దాకా ఉన్న పబ్బులను లాక్‌డౌన్‌కు ముందే మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వం మూసేయించిన విషయం తెలిసిందే. అనంతరం వైన్ షాపులను కూడా మూసినప్పటికీ లాక్‌డౌన్ 3.0 సడలింపుల్లో భాగంగా వాటిని మే నెల 5 నుంచి తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. అయితే కరోనా వ్యాప్తి భయంతో బార్లు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ అనుమతించలేదు. ఇలా మూడు నెలలకుపైగా బార్లు మూసి ఉండడంతో విస్కీ అమ్మకాలపై పెద్దగా ప్రభావం లేనప్పటికీ బీర్ల విక్రయాలపై మాత్రం గణనీయంగా ప్రభావం చూపిస్తోందని కంపెనీలు వాపోతున్నాయి. సాధారణంగా బార్లలో బీర్లనే ఎక్కువగా సేవిస్తుంటారని, షాపుల్లో కొని ఇళ్లకు ఎక్కువ సంఖ్యలో బీర్లు తీసుకెళ్లడం కష్టమని ఈ కారణంగానే బీర్ల విక్రయాలు తగ్గుతున్నాయని కంపెనీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో వేసవి సీజన్ బిజినెస్ పోగొట్టుకున్న తమకు ప్రస్తుతం బార్లు, పబ్బులు లేక వ్యాపారం రోజురోజుకు డల్ అవుతోందని వారు చెబుతున్నారు.
రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన 6 బీరు తయారు చేసే బ్రూవరీలు ఉన్నాయి. రాష్ట్రంలో నెలకు సగటున 34 లక్షల కేసుల బీరు అమ్ముడవుతుంటుంది. ఇదే వేసవిలో అయితే ముఖ్యంగా ఎండలు దంచి కొట్టే మే నెలలో ఏకంగా 60 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కరోనా కారణంగా వైన్ షాపులు మేలో కేవలం 25 రోజులే తెరచి ఉండడం, పర్మిట్ రూములు, బార్లు లేకపోవడంతో బీరు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మే నెలలో గత ఏడాదితో పోలిస్తే బీరు అమ్మకాలు 50 శాతానికిపైగా పడిపోయి కేవలం 23 లక్షల కేసుల బీర్ల విక్రయాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మే నెల తర్వాత వర్షాలు స్టార్టవడం, చల్లనివి ఏది తిన్నా, తాగినా కరోనా వస్తుందేమోనన్న భయంతో అతిపెద్ద బీరు మార్కెట్ అయిన తెలంగాణలో ప్రజలు బీర్లవైపు దాదాపు చూడడం మానేశారని కంపెనీలు లబోదిబోమంటున్నాయి. దీనికి తోడు కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ప్రభుత్వ ఆదాయాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రభుత్వం బీరుపై ఒకేసారి రూ.30 కొవిడ్ సెస్సు విధించడంతో చాలా మందికి బీరు ధర అందుబాటులో లేకుండా పోయిందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇవన్నీ వెరసి అతిపెద్ద బీరు మార్కెట్ అయిన తెలంగాణలో బీరు కంపెనీలకు గడ్డు పరిస్థితిని
తీసుకొచ్చాయనేది స్పష్టమవుతోంది.
అన్‌లాక్ 1.0 స్టార్టైన జూన్ 1వ తేదీ నుంచి రాజధాని హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు ప్రారంభమై కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాపారం జరుపుతున్నాయని, కేవలం బార్లను మాత్రం ప్రభుత్వం ఎందుకు మూసి ఉంచుతుందో అర్థం కావడం లేదని తెలంగాణ బ్రూవరీస్ అండ్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కామేశ్వర్ రావు అన్నారు. ఈ విషయమై తెలంగాణ వైన్ రిటైల్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. బార్లలో అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటించి విక్రయాలు జరిపే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే లిక్కర్ కంపెనీలకు వ్యాపారం పెరుగుతుందని ఆయన అన్నారు. బార్లు, లిక్కర్ కంపెనీలపై ఆధారపడి చాలా మంది ఉపాధి పొందుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు.