మూలిగే నక్కపై తాటిపండు పడడమంటే ఇదేనేమో!

by Shyam |
మూలిగే నక్కపై తాటిపండు పడడమంటే ఇదేనేమో!
X

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ కారణంగా బీడీ కార్మికులకు ఆకలి కేకలు తప్పడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని చాలా కుటుంబాలకు జీవనాధారం బీడీలే. చాలామంది మహిళలకు ఉపాధినిచ్చేది బీడీ పరిశ్రమనే. తెలంగాణ వ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ పరిశ్రమల్లో బీడీలు చుట్టేవారు( బీడీ రోలర్), ప్యాకింగ్ చేసేవారు, నెల జీతంపై పనిచేసే ఉద్యోగులు, కమీషన్ ఏజేంట్లు ఉంటారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బీడీ పరిశ్రమకు కరోనా కారణంగా లాక్ డౌన్ తో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది.

బీడీ పరిశ్రమకు నిజామాబాద్ జిల్లా పుట్టినిల్లు లాంటిది. ఈ జిల్లాలో 2.50 లక్షల మంది బీడీ పరిశ్రమపైనే ఆధారపడ్డారు. వెయ్యి బీడీలు చుడితే కార్మికులకు రూ.186.41 పైసలు చెల్లిస్తారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి బీడీ పరిశ్రమలను మూతపడ్డాయి. దీంతో బీడీ కార్మికులకు పనిలేక, పూట గడవక నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పరిశ్రమలలో పనిచేసిన వారికి యాజమాన్యాలు ఫిబ్రవరి నెల వేతనాలను మాత్రమే చెల్లించి.. మార్చి నెల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో ఆ కార్మికులకు చేతిలో డబ్బులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికీ వేతనాల ఇవ్వలేదు…..

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్యాక్టరీలలో, ఇతర సంస్థలలో పనిచేసే వారికి లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇవ్వాలని ఆదేశించాయి. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్క బీడీ యాజమాన్యం స్పందించలేదు. వలస కార్మికులకు రూ.500ల ఆర్థికసాయం చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదంటూ బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే అదుకోవాలి..

‘బీడీ పరిశ్రమలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అదుకోవాలి. చాలామంది కార్మికులు బీడీలను నమ్ముకుని జీవిస్తుండగా వారికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలో యాజమాన్యాలు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఒకవేళ యాజమాన్యాలు చెల్లించకపోతే వాటిని ప్రభుత్వమే చెల్లించాలి’ అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు వనమాల క్రిష్ణ అన్నారు.

Tags: Nizamabad, beedi workers, beedi industry, corona effect, problems

Advertisement

Next Story

Most Viewed