ఉద్యమనేత జనార్దన్‌కు కీలక పదవి.. ఆనందంలో కార్యకర్తలు

by Shyam |
ఉద్యమనేత జనార్దన్‌కు కీలక పదవి.. ఆనందంలో కార్యకర్తలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి.. టీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లా కో-కన్వీనర్‌గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్‌కు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఉద్యమకాలంలో పలు పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన బెక్కం జనార్దన్‌కు కీలక పదవి వస్తుందని ఆయన అభిమానులు, అనుచరులు అనుకున్నారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏడేళ్ల వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. పదవులు లేకపోయినా నిరాశ చెందకుండా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

జిల్లా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేల సిఫారసు మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బెక్కం ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో నియామక పత్రాన్ని బెక్కం జనార్దన్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. బెక్కం జనార్దన్‌కు పదవి దక్కడం పట్ల పలు సంఘాల నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story