గంగూలీ, జై షా పదవులపై సాగదీత

by Shiva |
గంగూలీ, జై షా పదవులపై సాగదీత
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, గౌరవ కార్యదర్శి జై షాల పదవుల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నది. మంగళవారం (ఫిబ్రవరి 16) ఈ కేసుకు సంబంధించిన విచారణ జస్టీస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టీస్ ఎస్. రవీంద్ర భట్‌ల ద్విసభ్య ధర్మాసనం చేపట్టనున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము విచారణకు హాజరుకాలేమంటూ బీసీసీఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు అభ్యర్థన పంపారు. బీసీసీఐ బోర్డు తరపున విచారణకు హాజరు కాలేమని, కరోనా కారణంగా అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన పనుల్లో ఆలస్యం కావడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేయాలని కౌన్సెల్ కోరింది. వాస్తవానికి రేపు బీహార్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ మధ్య ఉన్న బీసీసీఐ రాజ్యాంగానికి సంబంధించిన విచారణ జరగాల్సి ఉన్నది. అయితే బీసీసీఐ రాజ్యాంగంలోని కూలింగ్ పిరియడ్ అనే నిబంధనలో సవరణలు కోరుతూ వేసిన పిటిషన్ కూడా ఉండటంతో రెండింటినీ కలిపి విచారించాలని నిర్ణయించింది.

అపెక్స్ కోర్టు తీర్పే ముఖ్యం?

బీసీసీఐ రాజ్యాంగాన్ని జస్టీస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు మార్పులు చేశారు. దాన్ని బీసీసీఐ ఏజీఎం రెండేళ్ల కిందటే సుప్రీంకోర్టు అనుమతితో ఆమెదించింది. ఇప్పుడు ఆ రాజ్యాంగంలోని కీలకమైన నిబంధనను మార్చాలని తిరిగి సుప్రీంనే కోరుతున్నారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నికైన తర్వాత బీసీసీఐ ఏజీఎంలో కూలింగ్ పిరియడ్‌కు సంబంధించిన నిబంధన సవరించాలని తీర్మానించారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బీసీసీఐ రాజ్యంగ సవరణకు అపెక్స్ కోర్టును సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. అప్పటి నుంచి అపెక్స్ కోర్టులో దీనిపై విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది జులైలో ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ వచ్చినా.. కరోనా సమయంలో ఇది అత్యవసరమైన కేసు కాదని వాయిదా వేసింది. అలా వాయిదా పడుకుంటూ చివరకు ఫిబ్రవరి 16న విచారణకు స్వీకరించింది. రాజ్యాంగంలో కూలింగ్ పిరియడ్ సవరణ ద్వారా గంగూలీ, జై షాలు మరో ఐదేళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం ఉంటుంది.

రాజ్యాంగంలో ఏముంది?

బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలో ఏ వ్యక్తి కూడా వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ పదవిలో ఉండకూడదనే నిబంధనను జస్టీస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు. ఆ తర్వాత గంగూలీ, జై షా బీసీసీఐ పదవులు చేపట్టారు. అయితే అంతకంటే ముందు గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు, జై షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఐదేళ్లు పని చేశారు. దీంతో వీళ్లు బీసీసీఐ పదవుల్లో ఒక ఏడాది కంటే ఎక్కువ సమయం పదవుల్లో ఉండే వీలు లేకుండా పోయింది. గత ఏడాది జులైలో జై షా, అగస్టులో గంగూలీ అధికారికంగా తమ పదవులకు అనర్హులుగా మారారు. కానీ కేసు విచారణలో ఉండటంతో వారే ప్రస్తుతం కొనసాగుతున్నారు. రేపు అపెక్స్ కోర్టు గనుక 2 వారాల వాయిదాకు అంగీకరిస్తే వీరిద్దరూ మరో రెండు వారాలు ఆ పదవుల్లో కొనసాగుతారు. అయితే అపెక్స్ కోర్టు చివరకు ఏ తీర్పు ఇస్తుందో దాన్ని బట్టే వీరి పదవులు ఉంటాయో లేదో అనే సందిగ్దం వీడుతుంది. ఇక ఈ విచారణకు సంబంధించి జనవరిలో సుప్రీంకోర్టు పూర్తి సమాచారాన్ని అమికస్ క్యూరీకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story