బీసీసీఐ కీలక నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు ఇక పండుగే

by Shyam |
బీసీసీఐ కీలక నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు ఇక పండుగే
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా 2021-22 సంవత్సరానికి సంబంధించిన తొలి అర్థ భాగం సీజ‌న్ షెడ్యూల్‌కు బీసీసీఐ సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2020-21 సీజన్‌ నవంబర్‌ 14న జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌తో ముగుస్తుంది. న‌వంబ‌ర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌తో స్వదేశంలో క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే సంవత్సరం జూన్ 19న దక్షిణాఫ్రికాతో జ‌రిగే టీ 20 మ్యాచ్‌తో టీమిండియా స్వదేశంలో ఆడే సీజ‌న్ ముగుస్తుంది.

మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు…

నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 7 వరకు టీమిండియా కివీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. తొలి టీ 20 జైపూర్‌ వేదికగా నవంబర్‌ 17న జరుగుతుంది. రాంచీ, కోల్‌క‌తాల్లో న‌వంబ‌ర్ 19, 21న రెండు, మూడు టీ 20లు జ‌రుగుతాయి. అనంతరం కాన్పూర్‌ వేదికగా తొలి టెస్ట్‌ నవంబ‌ర్ 25 నుంచి 29 వ‌ర‌కు నిర్వహిస్తారు. ముంబయిలో రెండో టెస్ట్ డిసెంబ‌ర్ 3 నుంచి 7 వ‌ర‌కు జ‌రుగుతుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత 2022 ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టీ 20ల సిరీస్‌ ఆరంభమవుతుంది. తొలి వన్డే అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 6న జరగనుంది. 9, 12 వ తేదీల్లో జైపూర్‌, కోల్‌క‌తాలో మిగతా రెండు వ‌న్డేలు జ‌రుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 15 న క‌ట‌క్‌లో తొలి టీ20 జరుగుతుంది. 18 న వైజాగ్, 19న త్రివేండ్రం వేదికగా మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 25 నుంచి మార్చి18 వరకు టీమిండియా శ్రీలంకతో 2 టెస్ట్‌లు, 3 టీ 20ల సిరీస్‌ ఆరంభమవుతుంది. బెంగళూరులో తొలి టెస్ట్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు.. రెండో టెస్ట్‌ మొహాలీలో 5 నుంచి 9 వరకు జరుగుతుంది. మూడు టీ 20 మ్యాచ్‌లు 13న మొహాలీ, 15న ధర్మశాల, 18న ల‌క్నోల్లో నిర్వహిస్తారు. జూన్ 9న భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో సఫారీలు టీమిండియాతో 5 టీ 20 మ్యాచ్‌లు ఆడతారు. జూన్ 9న చెన్నై, 12 న బెంగుళూరు, 14 న నాగపూర్‌, 17 న రాజ్‌కోట్‌, 19న ఢిల్లీల్లో వరుసగా జ‌రుగుతాయి.

Advertisement

Next Story