ఐపీఎల్‌లో భారీ బెట్టింగ్‌లు.. నిఘా పెంచిన బీసీసీఐ

by Anukaran |
ఐపీఎల్‌లో భారీ బెట్టింగ్‌లు.. నిఘా పెంచిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ప్రపంచలోని మరే ఇతర లీగ్‌కు లేని ఆదరణ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్నది. క్రికెట్‌పై ప్రేమతో చూసే వాళ్లు కొందరైతే.. తమ అభిమాన క్రికెటర్ ఆడుతున్నాడని చూసే వారు మరికొందరు.. ఇక ఫ్రాంచైజీల మీద ప్రేమ.. స్థానిక టీమ్ అంటూ చాలా మంది ఐపీఎల్‌ను చూస్తారు. అయితే క్రికెట్‌ను కేవలం బెట్టింగ్స్ కోసం చూసే వాళ్లు మరి కొందరు ఉంటారు. వీరిలో ఎక్కువగా యువత, కాలేజీ స్టూడెంట్స్ ఉండటం గమనార్హం. మ్యాచ్ ఫలితం నుంచి బాల్ టూ బాల్ బెట్టింగ్ వరకు వీళ్లు కాయని పందెం ఉండదు. బెట్టింగ్ కాసే వాళ్లలో దాదాపు 90 శాతం మంది ఆర్థికంగా కుదేలయిపోతున్నారు. గత ఏడాది యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ జరిగిన సందర్భంలో కూడా విపరీతంగా బెట్టింగ్స్ జరిగాయి. అప్పట్లో ఫంటర్స్, బెట్టింగ్ మాఫియా వేధింపులకు చాలా మంది బలయ్యారు. కానీ, ఐపీఎల్ ప్రారంభం కాగానే మరోసారి బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. కనీసం రూ. 100 నుంచి రూ. 1 లక్ష వరకు బెట్టింగ్స్ సాగిస్తున్నారు. ఒక్కోసారి ఇంత కంటే భారీ మొత్తాలను కూడా బెట్టింగ్‌లలో పెడుతున్నట్లు తెలుస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో మొదలు..

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభమయ్యింది. ఆ మ్యాచ్ నుంచే బెట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కరీంనగర్ వంటి నగరాల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని కొన్ని బార్లు, పబ్బుల వేదికగా బెట్టింగ్ జరుగుతున్నట్లు వాట్సప్ గ్రూప్‌లలో మెసేజీలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టారు. గతంలో అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ ముఠాలు ఏకంగా మ్యాచ్‌లను ఫిక్స్ చేసిన ఘటనలు ఉన్నాయి.

దీంతో బీసీసీఐ తమ యాంటీ కరప్షన్ యూనిట్‌కు కొత్త బాస్‌ను నియమించింది. ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన షాబిర్ హుస్సేన్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. బుకీలు క్రికెటర్లను ఏ రూపంలో సంప్రదిస్తారో ఇప్పటికే అందరికీ అవగాహన కల్పించారు. కరోనా కారణంగా అన్ని మ్యాచ్‌లు బయోబబుల్ వాతావరణంలో జరుగుతుండటంతో బుకీలు నేరుగా క్రికెటర్లను కలుసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అనుమానిస్తున్నది. అందుకే గతంలో కంటే ఈ సారి ఏసీయూలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించారు. ప్రతీ ఫ్రాంచైజీకి చెందిన బయోబబుల్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారి కూడా ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు.

కొత్త రూట్లో దందా..

బుకీలు, ఫంటర్లు గతంలో బెట్టింగ్ దందా చేయడానికి మొబైల్ ఫోన్స్ ఉపయోగించేవి. ప్రతీ మ్యాచ్‌కు ఒక కొత్త ఫోన్‌తో బెట్టింగ్స్ నిర్వహించేవి. అయితే పోలీసుల నిఘా పెరిగిపోవడంతో యాప్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఫాంటసీ లీగ్స్ మాదిరిగా కనపడే యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఈ యాప్స్ రూపొందించాయి. సాధారణంగా బెట్టింగ్స్, తీన్ పత్తా వంటి యాప్స్‌ను తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో అనుతించరు. దీంతో థర్డ్ పార్టీ ద్వారా బెట్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఇటీవల బెంగళూరు సమీపంలో థర్డ్ పార్టీ ద్వారా బెట్టింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది 25 ఏళ్లు కూడా నిండలేదని పోలీసులు చెప్పారు. యువత ఎక్కువగా బెట్టింగ్స్‌లో కూరుకొని పోతుండటంతో తల్లిదండ్రులు వారిపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు చెబుతున్నారు. ఐపీఎల్ సమయంలో బార్లు, పబ్బులు, అనుమానిత ప్రదేశాలపై ఇప్పటికే పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు క్రికెటర్లు కూడా బుకీల చేతిలో చిక్కుండా బీసీసీఐ చేతిలో చిక్కుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది.

Advertisement

Next Story