కొండగట్టు అంజన్న సేవలో బండి సంజయ్

by Sridhar Babu |
bjp leader
X

దిశ, జగిత్యాల : ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని, జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సతీసమేతంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 24న భాజపా చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని, ఏ ఆలోచన, ఏ సంకల్పంతో ఈ యాత్ర ప్రారంభిస్తున్నామో, స్వామివారికి తెలిపి దర్శనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నా నమ్మకం, శక్తివంతమైన దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి అని, స్వామివారిని దర్శించుకుని పాదయాత్ర చేపడుతున్న సందర్భంగా అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తున్నామని అన్నారు.

పాదయాత్ర విజయవంతం అయిన తర్వాత మళ్లీ కొండగట్టు అంజన్నను, వేములవాడ శివయ్యను, దర్శనం చేసుకుంటానని తెలిపారు. తనకు ఆనవాయితీగా వస్తున్న ఆచారమని అన్నారు. మంచి ఆలోచనతో ఈ యాత్ర చేస్తున్నామని, పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ప్రజలలో చైతన్యం కల్పించాలని, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, ప్రజాస్వామ బద్దంగా పాలన జరగాలని యాత్ర చేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారకంగా జరపాలని డిమాండ్ చేశారు. అవినీతి కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని ఈ యాత్ర ప్రారంభిస్తున్నామని అన్నారు.

ఈ యాత్రలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. స్థానికంగా పార్టీ కార్యకర్తలు కలిసి బలోపేతం చేయాలన్నారు. ఈ నెల 24న భాగ్యలక్ష్మి దేవాలయం నుండి పాద యాత్ర ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకుంటూ యాత్ర ప్రారంభిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed