పాతబస్తీలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌కు పెను సవాల్

by Anukaran |
పాతబస్తీలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌కు పెను సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శనివారం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. ఈ అరాచక పాలనను అంతం చేయడానికి బీజేపీతో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, ఎంఐఎం కుటుంబాలు మాత్రమే రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు. బీజేపీ పాదయాత్ర ప్రభావంతో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తామని.. టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతాయని హెచ్చరించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు ముగుస్తున్నప్పటికీ పేదలు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పాలనతో సంతోషంగా లేరని అభిప్రాయపడ్డారు. కనీసం పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులున్నారని, రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇదేకాకుండా ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను నెరవేర్చకుండా.. పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ అధికారంలోకి రావాల్సిందే..

రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ అందరి కోసం పనిచేసే పార్టీ బీజేపీ అంటూ కొనియాడారు. పాతబస్తీ ఎవరి అడ్డా కాదని ఏ గల్లీకైనా, ఏ మూలకైనా వస్తామని తేల్చి చెప్పారు. తాలిబన్ భావజాలమున్న ఎంఐఎం పార్టీని, వారికి సహకరిస్తున్న పార్టీలను తరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. తాలిబన్‌కు సహకరిస్తున్న రజాకార్ల పార్టీ కావాలా..? తెలంగాణ ప్రజలు కావాలా? టీఆర్ఎస్ ఆలోచించాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ నిజంగా హిందువైతే పాతబస్తీ గడ్డ నుంచి శోభయాత్ర, హనుమాన్ జయంతి యాత్రను నిర్వహించాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed