అయోధ్య రామమందిరం.. పెరగనున్న ఎత్తు

by Shamantha N |
అయోధ్య రామమందిరం.. పెరగనున్న ఎత్తు
X

అయోధ్య: అయోధ్యలో భూమిపూజ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50మంది వీవీఐపీలు మాత్రమే హాజరుకానున్నారు. అయితే, ఆలయ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు స్తపతి తెలిపారు. 1988లో మొదటిసారి రామ మందిర డిజైన్‌ను రూపొందించారు. అప్పుడు ఎత్తును 141 అడుగులుగా నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితులు, భక్తుల రద్దీ తదితర కారణాల దృష్ట్యా ఆలయం ఎత్తును 161 అడుగులుగా నిర్ణయించారు.

‘ఆలయ డిజైన్‌ను తయారుచేసి 30ఏండ్లు గడిచాయి. ఎత్తును పెంచాల్సిన అవసరం ఉంది. రామ మందిరాన్ని సందర్శించడానికి భక్తులు ఎంతో ఆతృతతో ఉంటారు. ఈ నేపథ్యంలో ఎత్తును పెంచాలని నిర్ణయించాం. కొత్త డిజైన్ ప్రకారం ఆలయం ఎత్తు 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచాం. పూర్వ డిజైన్ ప్రకారమే పిల్లర్లు, శిల్పాల నిర్మాణం ఉంటుంది. అదనంగా రెండు మండపాలను నిర్మించనున్నాం ’ అని రామమందిర ప్రధాన స్తపతి సీ సొంపురా కొడుకు నిఖిల్ సొంపురా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ పూర్తికాగానే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే అవసరమైన యంత్రాలు, ముడిపదార్థాలు, కార్మికులతో ఎల్ అండ్ టీ బృందం అయోధ్యకు చేరుకున్నది. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 3.5ఏండ్ల సమయం పడుతుంది అని నిఖిల్ సొంపురా పేర్కొన్నారు.

భూమి పూజా కార్యక్రమాలు సుదీర్ఘంగా మూడు రోజులపాటు జరగనున్నాయి. అందుకే వచ్చే నెల 3నే పూజా కార్యక్రమాలను వేద పండితులు ప్రారంభిస్తారు. ఆలయ శంకుస్థాపనలో 40 కిలోల వెండి ఇటుకను వినియోగించునున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆలయ శంకుస్థాపన రెండు నెలలు ఆలస్యమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం 50మంది వీఐపీలు హాజరుకానున్నారు. భక్తుల సౌకర్యార్థం అయోధ్యలో భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed