సేవా హీ సంఘటన్-2.. ఈసారి స్టేట్‌ మొత్తం ప్లాన్ చేసిన బీజేపీ

by Shyam |
Seva Hi Sanghatan – 2
X

దిశ, తెలంగాణ బ్యూరో: సేవా హీ సంఘటన్​పేరుతో గతేడాది దేశవ్యాప్తంగా లాక్​డౌన్ సమయంలో కరోనా పేషెంట్లు, వలస కార్మికులకు బీజేపీ ఆధ్వర్యంలో అందించిన సేవలు సక్సెస్​కావడంతో మరోసారి ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సేవా హీ సంఘటన్–2 ప్రోగ్రాం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో సేవా హీ సంఘటన్–2 కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కమలనాథులు ప్రారంభించారు. కరోనా పేషెంట్లకు సలహాలు, సూచనలు, పాజిటివ్​వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆక్సిజన్, రెమ్​డెసివిర్, బెడ్స్, అంబులెన్సుల లభ్యత వంటి వివరాలను అందించేందుకు రాష్ట్ర కార్యాలయంలో రెండు కాల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర నాయకత్వం నలుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. కాల్స్​సెంటర్స్‌కు వచ్చే ప్రతీ కాల్‌ను వైద్యుల ద్వారా రోగులకు సూచనలిచ్చేలా ప్రోగ్రాంను డిజైన్​చేశారు. వీటితో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవా హీ సంఘటన్–2 కార్యక్రమం ద్వారా సర్వీసెస్​ అందించేలా ప్రణాళికలు రూపొందించింది.

ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో చాలా మంది కరోనా పేషంట్లు అవస్థలు పడుతున్నారు. పాజిటివ్​వచ్చిన రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వారు కాల్ సెంటర్స్‌కు ఫోన్​చేస్తే రోగులు, ఆసుపత్రి లేదా వైద్యులు మధ్య ఒక సంధాన కర్తగా వ్యవహరించి వారికి సహకారమందించనుంది. పేషంట్స్​అడిగితే ఆసుపత్రి, అంబులెన్స్, ఆక్సిజన్, రెమ్​డెసివిర్, బెడ్స్​వంటి సమాచారాన్ని వారికి వివరించనున్నారు. అంబులెన్స్​సంబంధించిన ఫోన్ నెంబర్స్​అందించడం, ఇంజెక్షన్​వివరాలు అడిగితే ప్రిస్కిప్షన్‌ను మెయిల్​ద్వారా పంపించడం, ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్స్​ఖాళీగా ఉన్నాయో వారికి చెప్పడం, సాధారణ బెడ్స్​వివరాలు తెలియజేయడం వంటి సేవలను అందజేయనున్నారు. ఇందుకోసం కాల్​సెంటర్స్​వద్ద వైద్యులను నిరంతరం అందుబాటులో ఉండనున్నారు.

దీంతో పాటు బూత్​స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కరోనా అవేర్​నేస్​ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్​పై అవగాహన వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. వృద్ధులెవ్వరైనా ఆహారం కోసం ఇబ్బందులు పడితే వారి ఇంటి వద్దేకే వెళ్లి భోజనాన్ని అందించాలని భావిస్తున్నారు. అంతేకాక ఆర్థిక ఇబ్బందులతో కరోనా చికిత్స తీసుకోలేని వారిని ఆదుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది బీజేపీ నాయకత్వం. త్వరలోనే హైదరాబాద్​లో 100 నుంచి 500 వరకూ ఐసోలేషన్స్ సెంటర్స్​ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందించాలని నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్​ వచ్చి ఇరుకు గదుల్లో ఉండి అవస్థలు పడే వారి కోసం ఈ సేవలను వినియోగించనున్నారు. మున్సిపల్​ఎన్నికలు పూర్తి కాగానే కరోనా రహిత బూత్, గ్రామం, డివిజన్ ప్రోగ్రామ్స్‌కు శ్రీకారం చుట్టాలని అనుకుంటోంది. వ్యాక్సినేషన్​సెంటర్స్​వద్ద అవసరమైన చర్యలను అందించాలని నిర్ణయించారు. మాస్కులు ధరించని, శానిటైజ్ చేసుకోని వ్యక్తులను గుర్తించి వారిని అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. వ్యాక్సినేషన్​సెంటర్‌కు వచ్చే వారికి తాగునీరు, అవసరమైతే జ్యూస్​ప్యాకెట్స్ అందించాలని నిర్ణయించారు. వలస కార్మికులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి అవసరమైన సరకులను అందించాలని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed