ఆల‌య బ‌హిష్కరణ బాధితుల‌కు న్యాయం జ‌రిగేనా..?

by Sumithra |   ( Updated:2021-11-23 12:13:11.0  )
ghatana-1
X

దిశ‌, ఎల్బీనగ‌ర్: కులాంత‌ర వివాహం చేసుకున్న 22 ఏళ్లకు ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ అని తెలియ‌డంతో దేవాల‌య క‌మిటీ నిర్వాహ‌కులు ఆల‌య బహిష్కరణ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా కులం పేరుతో దుర్భాష‌లాడారు. ఈ అమానుష ఘ‌ట‌న జ‌రిగి నాలుగు రోజులు అవుతుంది. అయినా ఇంత వ‌ర‌కు బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు. జ‌రుగుతుంద‌న్న నమ్మకం త‌మ‌కు లేద‌ని బాధిత కుటుంబ‌స‌భ్యులు ఆవేద‌న చెందుతున్నారు. బాధితుల వివ‌రాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా అబ్థుల్లాపూర్ మెంట్ మండ‌లం తొర్రూర్ గ్రామానికి చెందిన న‌క్క యాద‌గిరిగౌడ్ అదే గ్రామానికి చెందిన రాస‌మ‌ల్ల ప్రేమ‌ల‌త‌ను 22 ఏళ్ల క్రితం కులాంత‌ర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూత‌రు అనూష (20), కుమారుడు కిర‌ణ్‌కుమార్(19) సంతానం. కాగా 14 ఏళ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం న‌గ‌రానికి వ‌లస వ‌చ్చిన యాద‌గిరి కుటుంబం వనస్థలిపురంలోని కంచి కామ‌కోటి పీఠం ఆధీనంలోని శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వెంక‌టేశ్వరస్వామి ఆల‌యంలో చేరారు. దేవాల‌యంలోని క్వార్టర్స్ లోనే ఉంటూ అన్నప్రసాదం ఇన్ చార్జ్ గా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రెండు నెల‌ల క్రితం ప్రేమ‌ల‌త ద‌ర‌ఖాస్తు చేసుకున్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంక్వైరీ కోసం అధికారులు వ‌చ్చారు. ఎంక్వైరీలో భాగంగా కుల విష‌యం ప్రస్తావ‌న‌కు రావ‌డంతో ప్రేమ‌ల‌త‌ ద‌ళిత(మాదిగ‌) కులానికి చెందిన‌ట్లు తెలిసింది. విష‌యం తెలుసుకున్న ఆల‌య చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య కులాంత‌ర వివాహం చేసుకుని ఇంత‌కాలం దాచి పెడ‌తావా అంటూ.. 2 నెల‌ల పాటు యాద‌గిరిని ఉద్యోగంలో నుంచి తొల‌గించి ఆల‌య బహిష్కరణ చేశారు.

రోడ్డున ప‌డ్డ కుటుంబం..!

14 ఏళ్లుగా ప‌ని చేస్తున్న యాద‌గిరిగౌడ్‌ను కులాంత‌ర వివాహం చేసుకున్నాడ‌న్న నెపంతో ఆల‌యం నుంచి బహిష్కరించడంతోపాటు ఉద్యోగంలోంచి తొల‌గించ‌డంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డింది. గుడిలోని త‌మ ఇంటికి తాళం వేసి 2 నెల‌లుగా తెలిసినవాళ్ల ఇండ్లలో ఉంటూ త‌ల‌దాచుకుంటున్నారు. ఎక్కడా ప‌ని దొర‌క‌క‌పోవడంతో 2 నెల‌లుగా కుటుంబ‌స‌భ్యులు ప‌స్తులుంటున్నారు. దీంతో మ‌రోసారి ఆల‌య చైర్మన్ ను క‌లిసి వేడుకుందామ‌ని యాద‌గిరి కుటుంబ‌స‌భ్యులు నాలుగు రోజుల క్రితం అత‌ని ఇంటికి వెళ్లారు. ఉద్యోగంలోకి తీసుకోవాల‌ని కోరారు. అయినా క‌నిక‌రించని లక్ష్మయ్య ప్రేమ‌ల‌త‌ను కులంపేరుతో అసభ్య పద‌జాలంతో దూషిస్తూ.. నీవు మాదిగ కులానికి చెందినదానివ‌ని ముందే తెలిస్తే అప్పుడే ఆల‌యంలోకి రానిచ్చేవాళ్లం కాదంటూ దుర్భాష‌లాడాడు. అంతే కాకుండా వారిపై దాడి చేసి గేటు బ‌య‌టికి గెంటివేశాడు. గుడిలో తాళం వేసి ఉన్నా ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి ఇంట్లోని వ‌స్తువుల‌ను, సామాగ్రిని బ‌య‌ట‌ప‌డేశారు. దీంతో ప్రేమ‌ల‌త వనస్థలిపురం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అనేక ఒత్తిళ్లతో ఫిర్యాదు తీసుకునేందుకు నిరాక‌రించిన పోలీసులు.. చివ‌ర‌కు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.

కేసును నీరుగార్చేందుకు కుట్ర..!

యాద‌గిరిగౌడ్ భార్య ప్రేమ‌ల‌త ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. కానీ విచార‌ణను వేగ‌వంతం చేయ‌కుండా తాత్సారం చేస్తున్నారు. బాధితురాలిని కుల ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ తేవాలంటూ వ‌త్తిడి చేస్తున్నారు. మూడు రోజులుగా కుల ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ తేవ‌డంలేద‌ని బుకాయిస్తున్నారు. అయితే .. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు న‌మోదు కాగానే పోలీసులు పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టాలి. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం ఉన్నా లేక పోయినా వారి గ్రామానికి వెళ్లి వాస్తవ ప‌రిస్థితుల‌ను తెలుసుకోవాలి. పోలీసులు ప్రాథ‌మిక‌ విచార‌ణ చేయ‌కుండా బాధితుల‌నే స‌ర్టిఫికెట్‌లు తీసుకురావాలనడం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసుల తీరు ఉంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బాధితుల‌కు న్యాయం చేయాల‌ని ద‌ళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed