రక్తం ఏరులై పారింది.. 91 మంది ఊచకోత

by Sumithra |
రక్తం ఏరులై పారింది.. 91 మంది ఊచకోత
X

న్యూఢిల్లీ: పౌర ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ అధికారం చేపట్టాక మయన్మార్‌లో నెత్తురు ఏరులైపారుతున్నది. ఆర్మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై బలగాలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాయి. శనివారం ఒక్క రోజే 91 మంది ఆందోళనకారులను ఊచకోతకోశాయి. ఇందులో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు తర్వాత అత్యంత హింసాపాతం జరిగింది. సైనిక ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఇప్పటి వరకు 400 మందికిపైగా పౌరులు మరణించినట్టు మయన్మార్ నౌ అనే వార్తా సంస్థ పేర్కొంది.

మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం శనివారం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జుంటా లీడర్, సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్ మాట్లాడుతూ ప్రజలను మిలిటరీ కాపాడుతుందని, ప్రజాస్వామ్యాన్ని ఎత్తిపడుతుందని అన్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఎప్పుడున్నది స్పష్టతనివ్వలేదు. నిరసనలు విరమించాలని, ఆందోళనకారుల తలలోకి నేరుగా బుల్లెట్లు చొచ్చుకెళ్లే ముప్పు ఉందని హెచ్చరించారు. కాగా, జుంటా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ శనివారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆందోళనలు చేశారు. బైక్ ర్యాలీలు తీశారు. మండేలే నగరంలో 29 మంది ఆందోళనకారులను బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ఐదేళ్లబాలుడు కూడా ఉన్నాడు. యాంగాన్‌లో 24 మంది కాల్పులకు బలయ్యారు.

పిట్టల్లా కాలుస్తున్నారు

సైనికులు తమను పిట్టల్లా కాల్చేస్తున్నారని మింగ్యాన్ సెంట్రల్ టౌన్‌లో ఓ ఆందోళనకారుడు వాపోయాడు. తాము తమ ఇళ్లల్లో ఉన్నా కాల్పులు జరుపుతున్నారని ఆవేదన చెందాడు. అయినా తాము పోరాటాన్ని ఆపబోమని, జుంటా ప్రభుత్వ కూలే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశాడు. ఈ టౌన్‌లో ఇద్దరు ఆందోళనకారులను ఆర్మీ పొట్టనబెట్టుకున్నది. ఈ రోజు సైనిక ప్రభుత్వం సిగ్గుపడాలని, దాదాపు 100 మందిని పొట్టనబెట్టుకున్నదని జుంటా వ్యతిరేక బృందం సీఆర్‌పీహెచ్ ప్రతినిధి, డాక్టర్ సాసా అన్నారు

Advertisement

Next Story

Most Viewed