9న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం

by  |
9న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం
X

దిశ, స్పోర్ట్స్: టీ20 ఆసియాకప్ భవితవ్యం ఈనెల 9న తేలనుంది. అదేరోజు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం టెలీకాన్ఫరెర్స్ ద్వారా నిర్వహించనున్నారు. గత నెల 8న సమావేశమైన సభ్యులు ఆసియాకప్‌పై నిర్ణయాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. అదేరోజు శ్రీలంకలో ఆసియాకప్ నిర్వహించడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వ ప్రకటించారు. కానీ, ఆ ప్రకటనపై బీసీసీఐ మండిపడింది. ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ ఏడాది ఆసియాకప్ నిర్వహణ బాధ్యతలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేతిలో ఉన్నాయి. అయితే, పాకిస్తాన్‌కు వచ్చి ఆడటానికి బీసీసీఐ అభ్యంతరం తెలుపడంతో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహిస్తామని పీసీబీ చెప్పింది. ప్రస్తుతం ఉన్న కొవిడ్-19 సంక్షోభం ఉపఖండలో తీవ్రంగా ఉంది. ఒక్క శ్రీలంకలోనే కాస్త పరిస్థితి మెరుగ్గా ఉంది. అందుకే అక్కడ నిర్వహించడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని పీసీబీ చీఫ్ ఎహసాన్ మణి అన్నారు. ‘మా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. ఆసియాకప్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వ వెల్లడించారు. జూలై 9న జరిగే ఏసీసీ సమావేశంలో ఆసియాకప్ నిర్వహణపై స్పష్టత వస్తుందని, ఆ రోజే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏసీసీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.



Next Story