అత్యాశకు పోయి ఏసీబీకి చిక్కిన ASI..

by Sridhar Babu |   ( Updated:2021-06-25 09:12:14.0  )
అత్యాశకు పోయి ఏసీబీకి చిక్కిన ASI..
X

దిశ ప్రతినిది, కరీంనగర్ : అత్యాశకు పోయిన ఓ ఏఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిన్న గొడవను సర్దిచెప్పాల్సింది పోయి తన జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకున్నాడు ASI. వివాదం నుంచి బయటపడేందుకు బెయిల్ తెచ్చుకున్న వ్యక్తిని లంచం ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో చివరకు జైలు పాలు కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెలితే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బీరయ్యకు చెందిన గొర్రెలు రాజమల్లు పొలంలో మేత మేసాయి. దీంతో ఆగ్రహించిన రాజమల్లు బీరయ్యపై దాడి చేశాడు. బాధితుడు గంగాధర పోలీసులను ఆశ్రయించడంతో విచారణ కోసం వెళ్లిన ఏఎస్ఐ చంద్రారెడ్డి బీరయ్యపై దాడి చేసిన రాజమల్లును లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అలా చేస్తే కేసు నుంచి బయట పడేస్తానని చెప్పాడు. అప్పటికే రాజమల్లు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. దీంతో ASI డిమాండ్ చేసిన రూ.15 వేలు ఇచ్చేందుకు అతను ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే రాజమల్లును దుర్భాషలాడటమే కాకుండా, లంచం ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధిత వ్యక్తి ఎట్టకేలకు ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు స్కెచ్ వేసిన ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని బృందం శుక్రవారం రాజమల్లు నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు. చంద్రారెడ్డిని శనివారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

రిటైర్ మెంట్ మిస్..

చంద్రారెడ్డి గత నెలలో 58 ఏళ్లు నిండటంతో రిటైర్ కావాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం పదవీ విరమణ వయసును మూడేళ్లు అనగా 61 ఏళ్లకు పెంచడంతో ఆయన విధుల్లో కొనసాగుతున్నారు. పాత నిభందనల ప్రకారం అయితే చంద్రారెడ్డి రిటైర్ అయి ఇంటికే పరిమితం కావాల్సి ఉండగా.. ఇఫ్పుడు ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ కేసు ముగిసే వరకు కూడా ఆయనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందే అవకాశం లేకపోలేదు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story