టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

by Sumithra |
Sarpanch Upendra
X

దిశ, సూర్యా పేట : ప్రజలకు సేవ చేయాలనే తపనతో అధికారం చేపట్టిన ఓ మహిళా సర్పంచ్.. ప్రభుత్వ తీరుతో తనువు చాలించాలని చూసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆమె.. అప్పులు చేసి అభివృద్ధి చేపట్టింది. చేసిన పనులకు బిల్లులు రాక.. అప్పులు తీరక.. అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో గ్రామస్తులు స్పందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం..

చివ్వెంల మండలం పిల్లలజగ్గు తండాకు చెందిన ధరావత్ ఉపేంద్ర (38) టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచింది. అయితే ఆమె ఎన్నికల సమయంలో కొన్ని అప్పులు చేయగా.. ఆ తర్వాత గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల కోసం మరికొన్ని అప్పులు చేసింది. చేసిన పనులకు బిల్లులు రాగానే అప్పు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కానీ సంవత్సరాలు గడిచినా బిల్లులు రాకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టు తిరగడం ప్రారంభించారు. వారికి కొద్ది నెలలుగా సర్ధి చెప్పుకుంటు వస్తోంది. రోజురోజుకు వాళ్లు ఒత్తిడి పెంచడంతో మనస్థాపం చెందిన ఉపేంద్ర బుధవారం ఆమె నివాసంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు గమనించి ఉపేంద్రను సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. కాగా ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed