దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్..(వీడియో)

by Anukaran |   ( Updated:2023-10-10 11:33:32.0  )
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్..(వీడియో)
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : తెలంగాణ‌లోని విద్యార్థి, నిరుద్యోగ స‌మ‌స్యల‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైర‌న్ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని రాజీవ్ చౌక్‌ నుంచి ప్రారంభంకానున్న విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైర‌న్ ర్యాలీకి బ్రేక్ ప‌డింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నిర్వహించే ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో రాజీవ్ చౌక్‌ వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఎల్బీన‌గ‌ర్ ఇంచార్జ్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకెప‌ల్లి సుధీర్‌రెడ్డిల‌ను అరెస్ట్ చేసి ప‌హాడీ ష‌రీఫ్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అనంత‌రం మ‌హాత్మాగాందీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కాంగ్రెస్ కార్యక‌ర్తల‌ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండ‌టంతో పోలీసుల‌కు, కాంగ్రెస్ కార్యకర్తలకు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ నాయ‌కుల అరెస్ట్‌ల‌ను, మ‌హాత్మాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల స్వాధీనాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేసి, జంగ్ సైర‌న్ ర్యాలీ ప్రశాంతంగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు. పోలీసులు అత్యుత్సాహం ప్రద‌ర్శిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చరించారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు విద్యార్థులు, నిరుద్యోగులు, యువ‌జ‌నులు, కాంగ్రెస్ కార్యక‌ర్తలు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ రాజీవ్ చౌక్ వ‌ద్దకు త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందు ఉంటా.. లాఠీ త‌గిలినా.. తూటా త‌గిలినా ముందు నాకే త‌గులుతుంది. కార్యకర్తలు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదంతా నీకు తెలిసి జ‌రుగుతుందా..? తెలియ‌క జ‌రుగుతుందా..? అని ప్రశ్నించారు. వెంట‌నే పోలీసుల‌కు చెప్పి అనుమ‌తి ఇవ్వాల‌ని, ప్రశాంతంగా జ‌రిగే కార్యక్రమాల‌ను రెచ్చగొట్టొద్దని కోరారు. కొంత మంది పోలీసులు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని, వారి వివ‌రాలు అన్నీ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అవాంత‌రాలు క‌ల్పించినా విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైర‌న్ జ‌రుగుతుంద‌ని, నిరుద్యోగుల ప‌క్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద‌ని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed