వాడీవేడిగా ఏపీ శాసన మండలి

by srinivas |
వాడీవేడిగా ఏపీ శాసన మండలి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా జరిగాయి. అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టించాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దానికి అంగీకరించని వైఎస్సార్సీపీ నేతలు ద్రవ్య వినిమయ బిల్లు కంటే ముందే 3 రాజధానుల, సీఆర్డీఏ చట్టం బిల్లులపై చర్చించాలని చైర్మన్‌ను కోరారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వదం చోటుచేసుకుంది.
అంతకుముందు శాసనమండలిలో ఏ బిల్లు ముందు పెట్టాలన్న విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత సభలో అన్నిటికంటే ముఖ్యమైనది ద్రవ్య వినిమయ బిల్లు కాబట్టి దాన్నే చర్చకు తీసుకోవాలని యనమల డిమాండ్ చేశారు. దానిపై బుగ్గన మండిపడుతూ, కొత్త సాంప్రదాయాలు ఎందుకని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లు ముందు ప్రవేశపెడితే మండలి నిరవధిక వాయిదా పడే ప్రమాదమున్న నేపథ్యంలో రాజధాని బిల్లులు పెట్టాలని ప్రభుత్వం సూచించింది.

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తరువాత ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా సభను నడిపించవద్దని తొలుత సీఆర్డీఏ చట్టం, 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టిన తరువాతే అప్రోప్రియేషన్ బిల్ పెట్టాలని బుగ్గన తెలిపారు. ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

మంత్రి బొత్స వర్సెస్ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

మంత్రి బొత్స, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భోగాపురం ఎయిర్‍పోర్ట్ కాంట్రాక్టు తీసుకున్న జీఎంఆర్ కంపెనీని భోగస్ అన్నవారు ఇప్పుడు వారికెలా ఇచ్చారని ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీలో నేతల చేతివాటంపై రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన బొత్స భోగాపురం ఎయిర్‍పోర్టు భూముల్ని 500 ఎకరాలు తగ్గించి ఇచ్చామని అన్నారు. మీ నాయకుడిలా, ఆయన కొడుకులా దోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఊరికే ఆరోపణలు చేస్తే సరికాదన్న ఆయన ఆరోపణలకు రుజువులు చూపించాలన్నారు. దీంతో శాసన మండలిలో కొద్దిసేపు వాతావరణ వేడెక్కింది. రెండు పార్టీలు తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో కీలక బిల్లులు ఆమోదించకుండానే మండలి నిరవధిక వాయిదా పడింది.

మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి?

సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ఏపీ శాసనమండలి మరోసారి రణరంగంగా మారింది. ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా టీడీపీ సభ్యులు అడ్డుకోవడం, ప్రవేశపెట్టడానికి వైసీపీ సభ్యులు, మంత్రులు ప్రయత్నించడంతో వివాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రులు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర, మంత్రి వెల్లంపల్లి మధ్య గొడవ చోటుచేసుకుంది. పరస్పరం తోపులాడుకోవడమే కాకుండా పరస్పరం ముష్టిఘాతాలకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీలు బీదా రవించంద్రా, మంతెన సత్యనారాయణరాజులు మంత్రిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రభస కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సెల్ ఫోన్‌తో ఫొటోలు తీసినట్లు వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. సభా నియమాలకు విరుద్దంగా వ్యవహరించారంటూ లోకేశ్‌పై చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫొటోలు తీయవద్దన్న మండలి డిప్యూటీ చైర్మన్ హెచ్చరించారు.

తొడగొట్టి సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్

బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరావు, నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య వాగ్వాదం నెలకొంది. తమ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని విమర్శించారు. దీనిపై అనిల్ కుమార్ స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినప్పుడు, బీసీ అయితే అరెస్ట్‌ చేయకూడదా? అని ప్రశ్నించారు. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడిని అరెస్ట్‌ చేయడానికి వెళ్లారని గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలకు కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించినప్పుడు ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనిల్ కుమార్‌పై గతంలో వచ్చిన క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలను సంధించారు. దీనికి అనిల్ సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో తనకు నోటీసులిచ్చిప్పుడు ధైర్యంగా విచారణకు హాజరయ్యాననీ, విచారణలో క్లీన్‌చిట్ కూడా లభించిందని గుర్తుచేశారు. అలాగే, తనను ఓడించేందుకు టీడీపీ నేతలు భారీగా డబ్బులు పంచినప్పటికీ విజయం సాధించి సభలో అడుగుపెట్టానని చెబుతూ తొడగొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి వారి గడ్డాలను చూపిస్తూ రౌడీలంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి అనిల్ కుమార్ స్పందిస్తూ.. గడ్డం పెంచితే రౌడీలేనా? అని ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందనీ, వాళ్లు కూడా రౌడీలేనా? అంటూ కౌంటర్‌ అటాక్‌ చేశారు. దీంతో అక్రమ అరెస్టులు, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం లేదంటూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed