ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు.. ఎందుకిలా?

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు.. ఎందుకిలా?
X

దిశ, న్యూస్ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలవరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ప్రభుత్వ వ్యవహరణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌లు, జీవోల జారీ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇది ఇలా ఉండగా.. పలు తీర్పులపై ప్రభుత్వం కూడా మండిపడుతోంది. ప్రస్తుత ఎస్‌ఈసీ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే జగన్ పాలనలో ఏం జరుగుతుందని, హైకోర్టుతో ఈ గ్యాప్ ఎందుకు ఉంటుందని అధికార పార్టీ మంత్రులే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్‌పై హైకోర్టు తీర్పులు మరోసారి చర్చలోకి వచ్చాయి. ముందు నుంచీ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వానికి సయోధ్య లేదని స్పష్టమవుతోంది. తక్కువ సమయంలో ఏ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తాకలేదు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వ అధికారులు సైతం మొత్తం కోర్టు చుట్టే తిరగడం గమనార్హం.

ముఖ్యంగా నాలుగు అంశాలపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ చేసిన చర్యలు ట్రిబ్యునల్‌లో బెడిసికొట్టాయి. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు విచారణ జరిపి సీబీఐకి బదిలీ చేసింది. ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయడంపై మొట్టికాయలు వేసింది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తొలగింపుకు తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టివేసింది. ఈ పరిణామాలపై జగన్ సర్కారు కూడా చర్యలు చేపట్టింది.

ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. తీర్పు కాపిలు రాగానే సుప్రీంకోర్టులో పిల్ ధాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టులో వరుసగా వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో సీనియర్ న్యాయవాదులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఎస్ఈసీ విషయంలో హైకోర్టు తీర్పుని ముందుగానే అంచనా వేశామని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని అంశాలపై పునరాలోచన చేసి సుప్రీంకోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక పంచాయతీలకు రంగుల విషయంలో ఏపీ ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని హైకోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశారు. కోర్టుకు హాజరైన సీఎస్ కోర్టు ఉల్లంఘన తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో చాలా మంది అధికారులు కోర్టు మెట్లెక్కారు. సీఎస్ కూడా కోర్టుకు హాజరుకావాల్సి వస్తుండటంతో అధికారుల్లో ఒకింత భయం నెలకొంది.

హైకోర్టు తీర్పులను ఓసారి పరిశీలిస్తే..

జూలై 26, 2019 : పీపీఏల సమీక్ష అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ధరలపై నిర్ణయాధికారం ఈఆర్‌సీదే. తగ్గించుకోవాలని ప్రభుత్వం తరుపున బెదిరిస్తున్నారా.

ఆగస్టు 15, 2019: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు. కాన్వాయిలో జామర్ ఉండాల్సిందే.

ఆగస్టు 23, 2019: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఆంశంలో రివర్స్ టెండరింగ్ చెల్లదు. కాంట్రాక్టు రద్దు కుదరదు. జెన్‌కో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు.

సెప్టెంబర్ 13, 2019 : బందరు పోర్టుకు భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైంది. జీవోను వెంటనే నిలిపివేయండి.

అక్టోబర్ 29, 2019: విశ్వ విద్యాలయాల పాలకమండళ్ల నియామకాల్లో ప్రభుత్వ విధానం సరికాదు. ఏ పద్దతుల్లో పాలక మండళ్లను నియమించారు. విశ్వ విద్యాలయాల చట్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై నివేదికలు అందించండి.

నవంబర్ 2, 2019 : ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవహరంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రభుత్వం సరైన విధానం అమలు చేయడం లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు అధిక ధరలకు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది… చర్యలు తీసుకోండి.

నవంబర్ 15, 2019: పంచాయతీల పాలకవర్గాలు ముగిసి ఏడాదిన్నర ముగిసింది. ప్రభుత్వం ఏం చేస్తుంది. వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపండి.

నవంబర్ 30, 2019: ఆలయాల బోర్డుల రద్దు ప్రభుత్వ ఇస్టానుసారంగా చేయడానికి అసలే వీల్లేదు. పాస్టర్లు, ఇమాం, మౌజన్లకు ఏ నిబంధనల ప్రకారం పారితోషికం ఇస్తున్నారు.

డిసెంబర్ 14, 2019: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం ఏమిటి. ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్ధతి. ఎవరి అనుమతులతో ఇలా చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదు.

డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు. బిల్లులు కూడా చెల్లించకుంటే పరిస్థితి ఏంది. సౌర, పవన, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు. విద్యుత్తు బకాయిలు వెంటనే చెల్లించండి.

డిసెంబర్ 21 : పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య జీవో చెల్లదు. అంతా ఆంగ్లం అంటే కుదరదు. విద్యా హక్కు చట్టానికి విరుద్దం.

డిసెంబర్ 24: బార్‌లకు కొత్త లైసెన్స్‌లు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయండి.

డిసెంబర్ 25 : ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు.

డిసెంబర్ 25 : ఐపీఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ ఎలా చేస్తారు. పాలించే పద్దతి ఇది కాదు. ప్రభుత్వ వైఖరి కరెక్ట్ లేదు. ఐపీఎస్ అధికారి హోదా మార్చి బదిలీ ఎలా చేస్తారు. ప్రభుత్వానికి అధికారమా. ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి.

జనవరి 03, 2020: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మొత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎన్నికల సంఘానికి అందించాలి.

జనవరి 08, 2020: కేంద్రం నిధులను రాష్ట్రం ఎలా వాడుకుంటుంది. 2019-20కి సంబంధించిన మొదటి విడుత గ్రామీణ ఉపాధి హామీ పథకం చెల్లింపుల్లో భాగంగా కేంద్రం విడుదల చేసిన రూ. 1845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు జమ చేయలేదు. నెల రోజుల్లో వాటిని జమ చేయాలి.

జనవరి 23, 2020: రాజధాని అంశంలో ఉన్న వ్యాజ్యాల విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా. కార్యాలయాలను తరలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ఖర్చు చేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడుతాం.

జనవరి 27 : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చే చర్యల్లో భాగంగా పాఠ్య పుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతులు తదితర చర్చలు చేపట్టితే ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తాం. ప్రభుత్వ వైఖరి కరెక్ట్ కాదు.

జనవరి 27 : ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం ఏమిటి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఈ సమయంలో పంచాయతీలకు పార్టీ రంగులు ఎందుకు వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఏం చేస్తుంది. రెండు వారాల్లో రంగులు మొత్తం తొలగించాలి.

జనవరి 28: వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించడంలో అభ్యంతరం ఏమిటి. సీఎం జగన్ దీనిపై వివరణ ఇవ్వాలి.

ఫిబ్రవరి 5 : పార్లమెంట్‌లో ప్రధాని, హైకోర్టుల్లో సీజేల ఫొటోలు లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై సీఎం బొమ్మలు ఎందుకు… వెంటనే తొలగించాలి.

ఫిబ్రవరి 28: రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇండ్ల స్థలాలకు ఎలా కేటాయిస్తారు. జీవో రద్దు చేయండి.

మార్చి 3 : విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు. డీజీపీ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి.

మార్చి 20 : కర్నూల్‌కు కార్యాలయాల తరలింపునకు జీవో నిలుపివేత. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ కార్యాలయాల జీవో సస్పెన్షన్. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.

మార్చి 23: సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు. రంగులు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశం.

ఏప్రిల్ 15 : ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత. జీవో 81,85ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు.

మే 5: ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకట్ గౌడ్, విడదల రజినీకి నోటీసులు. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు.

మే 5: పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేయాలని జీవో నెంబర్ 623 విడుదల చేసిన ప్రభుత్వం. వైసీపీ రంగులతో పాటు మరో రంగు వేయాలని జీవో. ఈ జీవో 623ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు.

మే 7: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు.

మే 22 : డా. సుధాకర్‌పై జరిగిన దౌర్జన్యంపై ఆగ్రహించిన హైకోర్టు. సీబీఐ విచారణకు ఆదేశాలు. విశాఖ పోలీసులపై కేసు నమోదు. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు.

మే 22 : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావుపై సస్పెన్షన్ ఎత్తివేత. సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో రద్దు. మొత్తం ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ఆదేశం.

మే 24 : ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలి. కంపెనీలోకి ఎవరినీ అనుమతించరాదు. కోర్టు అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లరాదు. ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరించాలి.

మే 29 : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ విషయంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ కొట్టివేత. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపుపై ఆదేశాలు.

Advertisement

Next Story