అతి విశ్వాసం వద్దు : తిరుపతి ఉపఎన్నికపై జగన్ సమీక్ష

by srinivas |
jagan review on tpt election
X

దిశ, వెబ్ డెస్క్: అతి విశ్వాసం వద్దు, అందరూ సమన్వయం కలిసి పనిచేసి తిరుపతి లోక్ సభలో వైసీపీ గెలుపొందేలా ప్రణాళికలు రచించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచించారు. తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తితోపాటు పలువురు మంత్రులు, తిరుపతి నెల్లూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో పోటీ చేస్తోన్న పార్టీ ఎంపీ అభ్యర్ధి డా. ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు జగన్ పరిచయం చేశారు.

ఇప్పటివరకూ రాష్ట్రప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ ముఖ్యనేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని.. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని.. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ అందజేసిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ప్రతీ గడపకూ వెళ్ళి ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇదే అభివృద్దిని, సంక్షేమాన్ని కొనసాగించనున్నట్లు ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలన్నారు. స్ధానిక ఎన్నికలలో దేవుని దయ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని.. దీంతో దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల వైపు చూస్తోందన్నారు. ఇక్కడి నుంచి వచ్చే మెజార్టీ మన మెసెజ్‌ గా ఉండాలని నేతలకు సూచించారు. మహిళా సాధికారత, మహిళలకు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును కూడా తెలియజేయాలన్నారు.

ప్రతీ నియోజకవర్గానికి ఒక మంత్రి ఇంచార్జ్‌గా, ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ ఓటర్‌కు జరిగిన మంచి గుర్తుచేయడం, మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని అడగాలని హితవు పలికారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలపు సురేష్, రీజనల్‌ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డిలతోపాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed