'గంగుల కమలాకర్.. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్'

by Shyam |
గంగుల కమలాకర్.. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అర్థసత్యాలు, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే మంత్రి గంగుల కమలాకర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ధాన్యాన్ని కేవలం తెలంగాణ ప్రభుత్వమే కొంటోందని మంత్రి చెబుతున్నారని, ఆయన కనీసం పేపర్ అయినా చదువుతారా? లేదా? అని ప్రశ్నించారు. వార్తలు చూసైనా నిజానిజాలేంటో తెలుసుకోవాలని ఆయన మండిపడ్డారు. అసలు మంత్రికి ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో తెలుసా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, 20 వేల గన్నీ బ్యాగులను ధాన్యం కోసం సిద్ధం చేసిందని మంత్రి చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే 50 శాతం కొనుగోలు పూర్తయినట్లు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యంలో రైతులు తమ అవసరాలకు నిల్వ పెట్టుకోగా.. మిగిలిన మొత్తం కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటుందని అన్వేష్ రెడ్డి తెలిపారు. అందులో మూడో వంతు అంటే ప్రభుత్వం చెబుతున్న 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని, మిగిలిన ధాన్యాన్ని ఎప్పటిలోగా సేకరిస్తారో.., ఆ మొత్తాన్ని రైతులకు ఎప్పటిలోగా కొనుగోలు చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ట్రాన్స్ పోర్ట్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ధాన్యం అకాల వర్షానికి తడుస్తూ రైతులకు నష్టం చేకూరుస్తున్నాయని అన్వేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జుర్యాల కొనుగోలు కేంద్రంలో జంగ పెద్ద నర్సింహులు అనే రైతుకు చెనందిన ధాన్యాన్ని తూకం వేసి 15 రోజులైనా తరలించకపోవడంతో నిర్వాహకులతో వాగ్వాదం జరిగి నర్సింహులు భార్య పద్మ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుందని అన్నారు. రైతులు చస్తుంటే ఏమాత్రం పట్టించుకోలేని మంత్రికి పదవులు అవసరమా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం 20 వేల గన్నీ బ్యాగులు సమకూరుస్తోందన్న మాట పూర్తిగా అబద్ధమని, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ధాన్యం రాసులుగా పోసి ఉందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. మిల్లర్లు క్వింటాల్ కు 5 కిలోల పైనే తరుగు తీస్తున్నారని చెప్పారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో ఇంత అవినీతి జరుగుతుంటే మంత్రి గంగుల కమలాకర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed