మరో నిరుద్యోగి బలి

by Sumithra |   ( Updated:2021-04-27 23:27:10.0  )
మరో నిరుద్యోగి బలి
X

దిశ, చండూరు : నిరుద్యోగి సురేష్ నాయక్ మరణం వార్త రాష్ట్ర ప్రజలు మరచిపోకముందే మరొక నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్ (25)పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పాక రామచంద్రం, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన శ్రీకాంత్ చదువులో చురుకైన వ్యక్తి. స్థానికంగానే పదో తరగతి పూర్తి చేసి చండూర్ లో ఇంటర్, జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో డిగ్రీ, నిజాంబాద్ తెలంగాణ యూనివర్సిటీలో పీజీలో బోటనీ రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేశాడు.

ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఎన్నో పాటలు రాసి పల్లెపల్లెనా ప్రజలను జాగృతం చేశాడు. రెండు సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు. తల్లి మానసిక వికలాంగురాలు. దీంతో శ్రీకాంత్ కష్టపడి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నాడు. యూనివర్సిటీలో రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కెసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడని, తన జీవితం బాగుపడదని మానోవేధనకు గురై పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. దీంతో శ్రీకాంత్ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీకాంత్ మరణవార్త తెలియడంతో స్నేహితులు పెద్ద ఎత్తున గ్రామానికి తరలి రాగా గ్రామం శోకసంద్రంలో మునిగింది.

Advertisement

Next Story

Most Viewed