మావోయిస్ట్ పార్టీకి మరో షాక్.. అగ్రనేత లొంగుబాటు

by Sridhar Babu |   ( Updated:2021-09-17 05:28:53.0  )
badrachalam
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పు గోదావరి జిల్లాల డివిజన్ కమిటీ మెంబర్, చర్ల – శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారదక్క ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆమె భర్త, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ @ హరిభూషణ్ మరణానికితోడు, అనారోగ్య సమస్యలు, సిపిఐ (మావోయిస్టు) భావజాలంపై విశ్వాసం కోల్పోవడం వలన శారద లొంగిపోయినట్లుగా తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన జెజ్జరి సమ్మక్క తన 18వ ఏట 1994లో మావోయిస్టు (అప్పటి పీపుల్స్‌వార్) బాటపట్టారు. అప్పటి పాండవ దళ కమాండర్ యాప నారాయణ @ హరిభూషణ్‌ని 1995లో వివాహం చేసుకొని 1996 వరకు పాండవ దళంలో పనిచేశారు. తదుపరి 1997 నుండి 1998 వరకు ఆమె కిన్నెర దళంలో సభ్యురాలిగా పనిచేసింది. అనంతరం 1999 నుంచి 2000 వరకు ఆమె ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్‌టి‌ఎస్‌జడ్‌సి) లో ఫస్ట్ ప్లాటూన్ మెంబర్‌గా పనిచేశారు.

saradakka

2000 నుంచి 2004 వరకు దండకారణ్యంలో 6వ ప్లాటూన్ (సీసీ ప్రొటెక్షన్ టీమ్) లో పనిచేసిన ఆమె 2001 లో ఏసీఎంగా ప్రమోట్ చేయబడింది. తదుపరి 2005 నుంచి 2008 వరకు చర్ల ఎల్‌వోఎస్ కమాండర్‌గా పనిచేశారు. 2008 జూలై 28న, ఆమె ఏసీఎంగా వరంగల్ ఎస్‌పి ముందు లొంగిపోయింది. కొంతకాలం తర్వాత 2011 నవంబర్ 10న, ఆమె మళ్లీ మావోయిస్టు పార్టీలోకి వెళ్ళి భర్త హరిభూషణ్ బృందంతో కలిసి 2016 వరకు పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో శారదక్క చర్ల – శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2018 జనవరిలో ఆమె డివిజన్ కమిటీ సభ్యురాలిగా ప్రమోట్ అయిన ఆమె అటు డివిజన్, ఇటు ఏరియా కమిటీలను గైడ్ చేశారు. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టు ముఖ్యనేతగా కీలకమైన బాధ్యతలు చేపట్టిన శారదక్క లొంగుబాటు అంశం ఈ ప్రాంతంలో ప్రధాన చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed