- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గులాబీ’ నేతల చేతివాటం..కాళేశ్వరంలో మరో భూ కుంభకోణం
దిశప్రతినిధి, కరీంనగర్ : జలగర్భంలో మునిగిపోయే భూములకు రికార్డులు కూడా నాలుగు రోజులైతే మునిగిపోతాయనుకున్నారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వ భూములు చూపించి సర్కారు సొమ్మును కాజేయాలనుకున్నారు. అంగబలం ఆర్థిక బలం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చునుకుంటున్నారు. దీంతో కాళేశ్వరం మూడో విడుత భూ సేకరణలో తమవంతు ఆదాయాన్ని గడించాలనుకున్నారు. దీనికితోడు ఏకంగా రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో పంట భూములు మునిగిపోతున్నాయని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూములను సేకరించాలని నిర్ణయించింది.
ఈ మేరకు అధికారులు మరోసారి భూ సేకరణకు సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుల పేర్లు మారాయి. ప్రభుత్వ భూమే లక్ష్యంగా జరుగుతున్న ఈ దందాల తీరుపై అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామ శివారులోని 13 సర్వేనెంబర్లలోని వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో రికార్డులు తారుమారయ్యాయని ఆర్డీఓకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ విషయంపై రెవెన్యూ అధికారలు విచారణ చేశారో లేదో తెలియదు. కానీ భూ సేకరణ కోసం అప్పుడే గ్రామసభ నిర్వహించడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన భూ సేకరణ జరపాలన్న సాకు చూపించి హడావుడిగా తంతు పూర్తి చేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు అక్రమార్కులు.
రికార్డుల ట్యాంపరింగ్ పై విచారణ ఏదీ..?
కుదురుపల్లి శివారులోని భూ రికార్డుల ట్యాంపరింగ్ కోసం వచ్చిన ఫిర్యాదులపై రెవెన్యూ అధికారులు విచారణ చేశారా లేదా అన్నదే అంతు చిక్కకుండా ఉంది. ఒకవేళ విచారణ చేసినట్టయితే ఫిర్యాదు దారులకు సమాచారం ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏంటో తెలియడం లేదు. గ్రామసభకు ముందు మహాదేవపూర్ రెవెన్యూ కార్యాలయంలో వన్ బి నుండి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం పహాణీ రికార్డుల్లో పట్టా దారులు, కబ్జాదారుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుండటం వల్ల సర్కారు భూమికి ప్రభుత్వమే డబ్బులు వృథాగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఖజానాకు గండి పడుతుందే తప్ప చేకూరే ప్రయోజనం మాత్రం లేదంటున్నారు మహాదేవపూర్ ప్రాంత వాసులు.
అన్ని గ్రామాల పరిస్థితి ఇంతేనా..?
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు పరిహారం చెల్లించే విషయంలో కుదురుపల్లి గ్రామస్థుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, మేడిగడ్డ బ్యారేజ్‌కు ఎగువన ముంపునకు గురైన ఇతర గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయా? అన్న కోణంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
గులాబీ దండు పేర్లే ఎక్కువ..
కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపునకు గురైన జాబితాలో అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు రికార్డుల్లో చేరాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌గా ఏర్పడ్డ కొంతమంది నాయకులు ఈ వ్యవహారానికి తెరలేపినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే నిజమైతే సంబంధిత వ్యక్తుల నుంచి భూములు లాక్కుంటే ప్రభుత్వానికే రూ.కోట్ల డబ్బు ఆదా కానుంది.