ఉద్యోగాల భర్తీపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు

by Shyam |
Vijayashanti Facebook
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని, 50వేల ఉద్యోగాల భర్తీ అంటూ చేసిన ప్రకటన వెనుక కుట్రదాగి ఉందని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండి పడ్డారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

తెలంగాణలో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామంటూ ఎప్పుడో 7 నెలల కిందట ప్రకటించిన కేసీఆర్ కు ఉన్నట్టుండి నిరుద్యోగులపై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలంటూ నేడు మళ్ళీ ప్రకటన చేశారనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటుండదన్నారు. ఉద్యోగాలంటూ కేసీఆర్ ఎప్పుడు ప్రకటించినా ఆ వెనుక ఎంతో పకడ్బందీ కుట్ర ఉంటుందని అన్నారు. ఏడు నెలల కిందట చేసిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనను నాన్చి నాన్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అస్త్రంగా వాడుకున్నారని, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచాక… ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఉఫ్‌మని ఊదేశారని మండిపడ్డారు.

ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ భర్తీ అంటూ బాజాలు మోగిస్తున్నారని, తెలంగాణలో మూడేళ్ళుగా జాబ్ నోటిఫికేషన్లు లేవు… అంతకు ముందు కూడా చిన్నా చితకా నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల భర్తీకి పెద్ద నోటిఫికేషన్లు ఏవీ రాలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఎందరో నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయి… తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశానికి శాశ్వతంగా దూరమైపోయారని, ఇంకెందరో నిరుద్యోగులు ఏజ్ బార్ ప్రమాదానికి దగ్గర పడ్డారు.., పడుతున్నారన్నారు.

తెలంగాణ వచ్చినా సర్కారు కొలువులు దక్కలేదన్న నిరాశతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నిజంగా ఉద్యోగాల భర్తీపై అంత చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి రానిచ్చేవారు కాదన్నారు. నిజానికి లక్షా 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలుంటే… అందులో ఇప్పుడు తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంటున్నారని, దీనికే ఏళ్లకేళ్ల సమయం తీసుకుంటున్నారన్నారు. ఇక మిగిలిన లక్షా 40 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కావాలంటే కేసీఆర్ కొడుకు, మనుమలు, మునిమనుమలు కూడా సీఎంలు అయ్యే వరకూ ఎదురు చూడాలేమో అని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed