ఈనెల 20న యువగళం ముగింపు సభ: ముఖ్యఅతిథిగా పవన్ కల్యాణ్

by Seetharam |
achem
X

దిశ, డైనమిక్ బ్యూరో : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభను అత్యంత విజయవంతంగా నిర్వహించబోతున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ముగింపు వేదిక వద్ద సంప్రదాయబద్ధంగా అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణలు హాజరుకానున్నట్లు తెలిపారు. లోకేశ్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాం అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ ముగింపు సభ ఏర్పాటుకు సంబంధించి పనులను ప్రారంభించిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు,కళావెంకట్రావు, మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళీ మోహన్, ఎమ్మెల్సీ చిరంజీవరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 18న పాద యాత్ర ముగించి 20వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు భోగాపురం మండలం పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభ నర్వహిస్తాం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ముఖ్యఅతిథిగా పవన్ కల్యాణ్: అచ్చెన్నాయుడు

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు నారా చంద్రబాబు నాయుడు,పవన్ కల్యాణ్, బాలకృష్ణతోపాటు పలువురు ప్రముఖులు హాజరకానున్నట్లు టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఐదు లక్షల మంది ప్రజలు హాజరుకానున్నట్లు చెప్పుకొచ్చారు. ముగింపు సభకు సంబంధించి ఇప్పటికే పది రైళ్లు బుక్ చేశామని...బస్సుల కోసం ఆర్టీసీ డిపోలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. యువతకు భరోసా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించారని చెప్పుకొచ్చారు. ఈ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభించిందని అన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి జగన్ రెడ్డి సర్కారు అడుగడుగున ఆటంకాలు సృష్టించారని చెప్పుకొచ్చారు. ఈ రోజు వరకు 220 రోజుల్లో 3,000 వేల కిలోమీటర్లు లోకేశ్ పాద యాత్ర ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. అనివార్య కారణాలు వలన పాదయాత్ర శ్రీకాకుళం వరకు కొనసాగించటం లేదు అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. విశాఖ ఏయూ మైదానంలో సభ పెట్టాలని భావించామని అయితే జగన్ అడ్డుకోవడంతో అనుమతి లభించలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజానీకం తరలిరావాలి: అశోక్ గజపతిరాజు

నారా లోకేశ్ యువగళం ముగింపు సభలో మిత్ర పక్షంతో కలసి ఎన్నికల దిశానిర్ధేశం పార్టీ ప్రకటిస్తుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ ముగింపు సభకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో రాజ్యాంగం అమలుకావటం లేదని ఆరోపించారు. సైకో మళ్లీ అధికారంలోకి వస్తే, గౌరవ న్యాయమూర్తులను కూడా జగన్ ఇబ్బందిపెడతారని చెప్పుకొచ్చారు. జగన్‌ని ఎంత తొందరగా వారి ఇంటికి పంపిస్తే రాష్ట్రానికి అంత మేలు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు సూచించారు.

Advertisement

Next Story