Kadapa: ఏపీలో ప్రైవేటు బస్సు యజమానులకు షాక్ .. దసరాకు అలా చేస్తే చర్యలే..!

by srinivas |   ( Updated:2023-10-13 14:12:44.0  )
Kadapa: ఏపీలో ప్రైవేటు బస్సు యజమానులకు షాక్ ..  దసరాకు అలా చేస్తే చర్యలే..!
X

దిశ, కడప: ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్న రేట్లతో మాత్రమే బస్సులు నడపాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు బస్సు యజమానులకు కడప జిల్లా ఉప రవాణా కమిషనర్ ఈ. మీరా ప్రసాద్ ఆదేశించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఉప రవాణా కమిషనర్ (డిటిసి) మీరా ప్రసాద్.. స్థానిక రవాణ శాఖ కార్యాలయంలో వైయస్సార్ జిల్లా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ బస్సు యజమానులతో మాట్లాడుతూ దసరా సందర్భంగా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్న రేట్లతో మాత్రమే బస్సులు నడపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రేట్లు పెంచకూడదన్నారు. టికెట్ రేట్లు పెంచినట్లయితే కేసులు బుక్ చేసి జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎనిమిది ప్రత్యేక తనిఖీ బృందాలు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాహన యజమానులు తమ వాహనాల యొక్క పనులన్నీ వాహన పోర్టల్ ద్వారా మాత్రమే జరుపుకోవాలని తెలిపారు. ఓటిఎస్ ఐ/ఈ ప్రగతి పోర్టల్‌లో జరుపుకున్న పనులు వాహన పోర్టల్‌తో అనుసంధానం కావడం కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ దృష్ట్యా తప్పనిసరిగా తమ వాహన కార్యకలాపాలన్నీ వాహన పోర్టల్‌లో మాత్రమే జరుపుకోవాలని ఈ. మీరా ప్రసాద్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed